మండుతున్న ఎండలు!

29 Mar, 2014 04:19 IST|Sakshi

రాష్ట్రంలో పలు చోట్ల భారీ ఉష్ణోగ్రతలు నమోదు
 సాక్షి, విశాఖపట్నం: వేసవి ప్రారంభంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు చిర్రెత్తుతున్నాయి. భానుడి భగభగలతో ఉదయం 9 దాటాక బయటికి వచ్చేందుకు ప్రజలు భయపడే పరిస్థితి తలెత్తుతోంది. దీనికితోడు విద్యుత్ కోతలు జనాన్ని మరింతగా అల్లాడిస్తున్నాయి. ఫలితంగా వృద్ధులు, చిన్నారుల పరిస్థితి నరకంగా మారింది. శుక్రవారం రాష్ట్రంలోని పలుచోట్ల సాధారణం కంటే భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావడం వాతావరణ నిపుణుల్ని సైతం ఆశ్చర్యపరిచింది.
 
 విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సాధారణం కంటే ఏకంగా ఏడు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం ఇదే ప్రాంతంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, ఒక్క రోజు వ్యవధిలో ఏకంగా 41 డిగ్రీలకు చేరింది. గాలిలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత తీవ్రమైందని నిపుణులు తెలిపారు. ఇంటీరియర్ ల్యాండ్ మాస్, స్థానిక పరిశ్రమలు కూడా ఈ ఉష్ణోగ్రతల ఆకస్మిక పెరుగుదలకు కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. ఏయూ వాతావరణ విభాగ విశ్రాంత ఆచార్యులు ఒ.ఎస్.ఆర్.యు.భానుకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వాతావరణంలో అధిక పీడనం ఏర్పడే ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు.

>
మరిన్ని వార్తలు