బడికా.. మేమెళ్లలేం!

23 Mar, 2016 14:31 IST|Sakshi

 సగానికి పడిపోయిన విద్యార్థుల హాజరు
 ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతున్న తల్లిదండ్రులు

 
 ప్రొద్దుటూరు :  ఎండల ప్రభావం కారణంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం క్రమేణా తగ్గుతోంది. ఈనెల 8వ తేది నుంచి  వైఎస్ఆర్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒంటిపూట బడులను అమలు చేస్తున్నారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 7.45-12.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3110 ప్రాథమిక, 569 ప్రాథమికోన్నత, 820 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 4499 పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో 2,21,365 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో పదవ తరగతి పరీక్షల కోసం 173 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్క ప్రొద్దుటూరులోనే 17 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 నుంచి 5 గంటల వరకు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. దీంతో ఎండల ప్రభావం కారణంగా ఎక్కువ శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు గైర్హాజరవుతున్నారు. ఉదాహరణకు ప్రొద్దుటూరు అనిబిసెంటు మున్సిపల్ పాఠశాలలో మొత్తం 292 మంది విద్యార్థులకుగాను సోమవారం 220 మంది, మంగళవారం 245 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. వైవిఎస్ మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో 450 మందికిగాను సోమవారం 279 మంది, మంగళవారం 269 మంది మాత్రమే హాజరు కావడం గమనార్హం. కశెట్టి చిన్నవెంకటసుబ్బయ్య ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో కూడా పలువురు విద్యార్థులు గైర్హాజరయ్యారు.

జిల్లా అంతటా పలు పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం పూట కాకుండా ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు పాఠశాలలను నడపాలని ఉపాధ్యాయ వర్గాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎండల దృష్ట్యా పాఠశాల విశ్రాంతి సమయంలోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా చాలా పాఠశాలల్లో ఈ విధానం అమలు కావడం లేదు. పాఠశాల వదిలాకే భోజనం పెడుతుండటంతో ఎండలో ఉండలేక చాలా మంది పిల్లలు ఇళ్లకు పరుగులు పెడుతున్నారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు,  ఇతర పాఠశాలల్లో 7 నుంచి 11 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి.

‘పదవ తరగతి పరీక్షలు నిర్వహించే పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు గైర్హాజరు అవుతున్నారని సమాచారం అందింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకుంటాం’ అని డీఈఓ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ‘ఎండల వల్ల 60 శాతం మంది విద్యార్థులే పాఠశాలలకు హాజరవుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం దెబ్బ తినకుండా పాఠశాల వేళలు సవరించాలి’ అని కొత్తకొట్టాల మున్సిపల్ ఉర్దూ హైస్కూల్ హెడ్మాస్టర్ ఇమాం హుసేన్, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.శ్యాంసుందర్‌రెడ్డి, ఎస్టీయూ రీజనల్ కన్వీనర్ రషీద్‌ఖాన్ కోరారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు