గజగజ

24 Dec, 2014 00:44 IST|Sakshi
గజగజ

 జిల్లాపై చలిపులి పంజా విసురుతోంది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అర్ధరాత్రి అయ్యే సరికి 14 డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రత పడిపోతుండడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. ఏజెన్సీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకున్నాయి. వృద్ధులు, వ్యాధి గ్రస్తులు మృత్యువాత పడుతున్నారు.విజయనగరం కంటోన్మెంట్, పార్వతీపురం, కురుపాం: జిల్లాలో మూడు రోజులుగా చలిగాలులు విపరీతంగా  వీస్తుండడంతో సాయంత్రం నాలుగు గంటలకే చలికోటు, చెవులకు వస్త్రాలను కప్పుకొని ప్రజలు బయట తిరగవలసి వస్తోంది. ఉన్ని వస్త్రాలు ధరించనిదే బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యం గా తీర ప్రాంత గ్రామాల ప్రజలు, ఏజె న్సీ వాసులు గజగజలాడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకూ చలి వీడడం లేదు. రాత్రిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.  రాత్రివేళ పదిన్నర నుంచి పదకొండు వరకూ జనసంచారం ఉండే విజయనగరం  వంటి పట్టణాలు రాత్రి 9 గంటలయ్యే సరికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. అదేవిధంగా ఉదయం తొమ్మిది గంటల యితే కానీ ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.
 
 వణుకుతున్న గిరి సీమలు
 ఏజెన్సీలో  కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు ఉన్నట్టుండి మంగళవారం నాటికి అమాంతంగా  8 డిగ్రీల నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడుకు పడిపోవడంతో గిరి సీమలు గజగజలాడుతున్నాయి.  కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, సాలూరు, మక్కువ, పాచిపెంట తదితర మండలాలకు చెందిన గిరి శిఖర ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది.    చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెర్టర్లు, ఉన్ని కోట్లు, రగ్గులు, జర్కిన్లు, మంకీ  క్యాప్‌లు  ధరిస్తున్నారు. చలి మంటలు, కుంపట్ల వద్ద కాలక్షేపం చేస్తున్నారు.  ఈ మంచు, చలిలో  పోడు పనులకు, గెడ్డలకు కూడా వెళ్లలేకపోతున్నామని గిరిజనులు వాపోతున్నారు. ఉదయం 10 గంటలయితే గాని ఇంటి నుంచి బయటికి రావడం లేదు. అలాగే సాయంత్రం 4 గంటలకే పల్లెలన్నీ దుప్పటి ముసుగేసుకుంటున్నాయి.  కొమరాడ ఏజెన్సీలోని  కుంతేసు, నయ, రెబ్బ, వనధార, పెదశాఖ, గుణదతీలేసు, పూడేసు, గుమ్మలక్ష్మీపురం మండలంలోని తాడికొండ, పెదఖర్జ, పుక్కిడి, కేదారిపురం, కందికుప్ప, రేగిడి, దుడ్డుకల్లు, తాడికొండ ప్రాంతాలు, గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన దురిబిలి, బజ్జిల, వప్పంగి, గొందిలోవ, కాకిలి, దండుసూర, టిక్కబాయి తదితర ప్రాంతాల గిరిజనులు  తీవ్ర అవస్థలు గురవుతున్నారు.  పూరిగుడెసెలన్నీ మంచుమయం కావడంతో చలికి నిద్ర పట్టక రాత్రి పూటంతా మంటల వద్ద గిరిజనులు గడుపుతున్నారు.
 
 కమ్మేస్తున్న పొగమంచు
  పడిపోతున్న ఉష్ణోగ్రతలకు తోడు పొగమంచు కమ్మేస్తుండడంతో రైతులు, వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి పూట, తెల్లవారు జామున వాహనాలపై ప్రయాణించేవారికి ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించడం లేదు. దీంతో ప్రమాదాలకు గురికావలసి వస్తుందేమోనని వారు భయపడుతున్నారు. ద్విచక్రవాహనాలపై ప్రయాణించేవారు చేతులకు గ్లౌసులు, హెల్మెట్, కాళ్లకు షూస్ ధరించి ప్రయాణించవలసి వస్తోంది.  జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట, ఎస్.కోట ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా కురుస్తోంది.  చలి తీవ్రంగా ఉండడంతో వసతి గృహాల విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి.  చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.  వరి నూర్పు పనుల్లో  ఉన్న రైతులు ఇబ్బందికి గురవుతున్నారు. కూరగాయలు, ఇతర ఉత్పత్తులు విక్రయించే వారు అవస్థలు పడుతున్నారు.   
 
 తీరప్రాంత గ్రామాల్లో...
 తీర ప్రాంత గ్రామాల్లో పరిస్థితి మరీ ఇబ్బంది కరంగా ఉంది. సముద్రం నుంచి రొజ్జగాలి వీస్తుండడంతో ఇళ్లలో కూడా ఎవరూ ఉండలేకపోతున్నారు. రోజూ తెల్లవారు జామున ఐదు గంటలకు సముద్రంలోకి వేటకు వెళ్లి, తిరిగి ఉదయం 10 గంటలకు తీరానికి చేరుకునే మత్స్యకారులు ప్రస్తుతం ఉదయం ఆరు గంటలకు వెళ్లి తొమ్మిది గంటలకల్లా ఒడ్డుకు వచ్చేస్తున్నారు. సముద్రంలో చలి ఎక్కువగా ఉందని, శరీరం కర్రకట్టేస్తుండడంతో ఉండలేక వచ్చేస్తున్నామని మత్స్యకారులు తెలిపారు. చేపల వేట సాగక  అర్థాకలితో గడపవలసి వస్తోందని వారు వాపోయారు.
 
 కోరలు చాస్తున్న వ్యాధులు
 విజయనగరం ఆరోగ్యం:ఇక ఈ చలికి దగ్గు, జలుబు   ప్రజలను బాధిస్తున్నాయి.   కొంతమంది   వైరల్ జ్వరాల భారిన పడుతున్నారు. ఇక ఉబ్బసం, ఆస్తమా, టీబీ రోగులు నానా అవస్థలు పడుతున్నారు.-  చలికాలంలో ఎక్కువుగా వృద్ధులు, పిల్లలు  న్యుమోనియా  వ్యాధికి గురియ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రక్తపోటు పెరిగి గుండెపోటుకు  గురయ్యే   ప్రమాదం ఉంది. చర్మం పొడిబారిపోతుంది. సోరియసిస్ వంటి చర్మవ్యాధుల తీవ్రత ఎక్కువవుతుంది. అదేవిధంగా మంచు ఎక్కువుగా పడడం వల్ల గొంతు సంబంధిత వ్యాధులు బాధిస్తాయి.  
 
  తీసుకోవాల్సిన జాగ్రత్తలు
  సాధ్యమైనంతవరకు చల్లగాలిలో తిరగరాదు. గోరు వెచ్చనినీళ్లు తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు స్వెట్టర్లు, మంకీక్యాప్‌లు, గ్లౌజులు ధరించి వెళ్లాలి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచింది.  వేడి పదార్థాలు  భుజించాలి, పడని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి, అస్తమా తదితర వ్యాధులను అదుపులో ఉంచే మందులను క్రమం తప్పకుండా వాడాలి.
 

మరిన్ని వార్తలు