బద్వేలులో ఆస్పత్రి తరలింపు, ఉద్రిక్తత

18 May, 2015 13:25 IST|Sakshi
బద్వేలులో ఆస్పత్రి తరలింపు, ఉద్రిక్తత

బద్వేలు : వైఎస్సార్ జిల్లా బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆసుపత్రి సామగ్రిని తరలిస్తుండగా సోమవారం స్థానికులు అడ్డుకున్నారు. వివరాలు... బద్వేలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూతనంగా ప్రసూతి ఆస్పత్రి నిర్మించారు. పట్టణం నడిబొడ్డున 150 సంవత్సరాలుగా ఉన్న జనరల్ ఆస్పత్రిని కొత్తగా నిర్మించిన ప్రసూతి ఆస్పత్రి భవనాల్లోకి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే ఇందుకు స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు అన్నివిధాలుగా సౌకర్యవంతంగా ఉన్న ఆస్పత్రిని ఇక్కడి నుంచి తరలించరాదని గతంలో కూడా స్థానికులు వాదించారు. ప్రభుత్వ ఒత్తిడికి లొంగిన కలెక్టర్ జనరల్ వైద్యశాలను ప్రసూతి ఆస్పత్రి భవనాల్లోకి మార్చాలని ఉత్తర్వులిచ్చారు. సోమవారం ఉదయం దాదాపు 200 మంది పోలీసు బలగాలను రప్పించి జనరల్ ఆస్పత్రిలోని ఫర్నీచర్‌ను తరలిస్తుండగా ప్రజలు భారీగా తరలివచ్చి అడ్డుకున్నారు. ఆస్పత్రి ఇక్కడే నిర్వహించాలని భీష్మించారు. ప్రజలను అడ్డుకున్న పోలీసులు ఆస్పత్రిలోని పరికరాలు, ఫర్నీచర్‌ను తరలించారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 

మరిన్ని వార్తలు