తాడిపత్రిలో ఉద్రిక్తత

13 Jul, 2018 11:19 IST|Sakshi

బాధితులకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగిన ప్రతిపక్షాలు

టీడీపీ నేతల అండదండలతో రెచ్చిపోతున్నారు : పెద్దారెడ్డి

వైఎస్సార్‌సీపీ, వామపక్ష నేతల అరెస్ట్‌

సాక్షి, అనంతపురం : తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గెర్డావ్‌ స్టీల్‌ ఫ్యాక్టరీలో విషవాయువులు  వెలువడి ఆరుగురు మృతి చెందిన నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, వామపక్ష పార్టీలు ఆందోళనలు దిగాయి. తాడిపత్రి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, వామపక్ష పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీని చుట్టుముట్టారు. అయితే వీరిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రత్యేక బలగాలను మొహరించారు.

ప్రమాదంలో మృతి చెందిన ఆరు కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం, ఐదు ఎకరాల పొలం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని పెద్దారెడ్డి డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం నాయకుల అండదండలతో యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని ఆయన మండిపడ్డారు. నామమాత్రంగా ఎక్స్‌గ్రేషియా చెల్లించి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులకు  కనీసం మాస్క్‌లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మృతులందరూ రోజువారి కూలీ చేసుకొనే బడుగు జీవులని, వారికి నష్ట పరిహారం అందించి కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదం జరిగి దాదాపు 20గంటలు గడిచినా యాజమాన్యం స్పందించలేదని ధ్వజమెత్తారు.

యాజమాన్యానికి వారికి జేసీ బ్రదర్స్‌ అండదండలు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. జేసీ బ్రదర్స్‌కు స్టీల్‌ కంపెనీ నెలకు దాదాపు పది కోట్ల రూపాయలను చెల్లిస్తోందని, అందుకే జేసీ దివాకర్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డిలు నోరు మెదపలేదని ఆరోపించారు. గొప్పలు చెప్పుకునే జేసీ బ్రదర్స్ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడలేదని ధ్వజమెత్తారు. అధికార పక్ష నేతలుగా జేసీ సోదరులు వెంటనే స్పందించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. అయితే ప్రతిపక్షం, వామపక్ష నేతలు చేస్తున్న ఆందోళను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలను బలవంతంగా పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులను వైఎస్సార్‌సీపీ నేతలు ఖండించారు. అప్రజాస్వామికంగా అరెస్టులకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.

ఫ్యాక్టరీపై కేసు నమోదు : గెర్దావ్ ఫ్యాక్టరీపై సెక్షన్‌ 304 కింద కేసు నమోదు చేసినట్లు అనంతపురం ఏఎస్సీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదనే వైఎస్సార్ సీపీ నేతలను అరెస్టు చేసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు