కల్లోల కడలి

3 Jul, 2019 07:22 IST|Sakshi

సాక్షి, వజ్రపుకొత్తూరు(శ్రీకాకుళం) : కడలి కల్లోలమవుతోంది. అలలు ఉగ్రరూపం దాల్చి తీరానికి వస్తున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలను చూసి మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని భావనపాడు, మంచినీళ్లపేట, బారువ తీరాల్లో దాదాపు 50 మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. అలల తాకిడికి వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట తీరంలో సముద్రం దాదాపు 135 మీటర్ల మేర ముం దుకు వచ్చింది. తీరానికి ఆనుకుని ఉన్న ఇసుక దిబ్బలు కోతకు గురవుతున్నాయి. మంచినీళ్లపేటతో పాటు దేవునల్తాడ, అక్కుపల్లి, డోకులపాడు తీరంలో తీరం కోతకు గురైంది. అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం వెరసి కోస్తా తీరానికి భారీ వర్షం పొంచి ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించడంతో శ్రీకా కుళం జిల్లాలో తీరం ప్రాంతాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ దండోరాలు వేయించిన రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలంటూ సూచిస్తున్నారు. తీరంలోనే వేట సామగ్రి వదిలిన మత్స్యకారులు వేట లేకరెండురోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు.

ఏడాదిలో ఐదోసారి
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తీరం కోత కు గురవడం ఇది ఐదోసారని, గతంలో వచ్చిన తుఫాన్, అధిక వర్షాలకు ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఉండేది కాదని మత్స్యకారులు చెబుతున్నారు. మంచినీళ్లపేట, దేవునల్తాడ, అక్కుపల్లి ప్రాంతాల్లో ఏడాదిలో ఐదు సార్లు తీరం కోతకు గురైంది. జిల్లాలో సంతబొమ్మాళి, గార, ఎచ్చెర్ల మండలాల్లో చాలా చోట్ల తీరం ఇలాగే ఆందోళన రేకెత్తిస్తోంది. ఇది ఒక రకంగా ప్రమాదానికి సూచిక అంటూ పెద్దలు హెచ్చరిస్తున్నారు. హుద్‌హుద్, తిత్లీ, ఫొని లాంటి తుపాన్లే ఇందకు నిదర్శనం కాగా.. సముద్ర అంతర్భాగంలోని పొరల్లో ఏర్పడుతున్న అలజడి ఓ కారణం అంటూ నిపుణులు చెబుతున్నారు. నెల రోజుల కిందట అక్కుపల్లి తీరంలో దాదాపు కిలోమీటరు మేర, ఇప్పుడేమో మంచినీళ్లపేట తీరంలో 2 కిలోమీటర్ల మేర తీరం కోతకు గురైంది.

పస్తుల్లో గంగపుత్రులు 
వరుసగా తుఫాన్లు, అల్పపీడన ద్రోణులు ఏర్పడుతుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లడం కుదరడం లేదు. వేట లేక మత్స్యసంపద చిక్కక, చిక్కిన సంపదకు దళారుల బెడద కలగలిపి గంగపుత్రులను బెంగ కు గురి చేస్తున్నాయి. మరో పక్క 61 రోజుల పాటు వేట నిషేధ భృతి ఇంకా అందలేదు. ఆయిల్‌ సబ్సిడీ సైతం అందని మత్స్యకారులు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వేట నిషేధ భృతి పెంచింది. తుఫాన్ల సమయంలోనూ తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.  

చేపల వేటకు వెళ్లొద్దు 
అల్పపీడణ ద్రోణి ఉన్నందున మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని ఆదేశించాం. ఇప్పటికే మా సిబ్బంది ద్వారా సాగర మత్స్యకార సొసైటీ అధ్యక్షులకు సమాచారం అందించాం. తీర ప్రాంత గ్రామాల్లో దండోరాలు వేయించాం. వేట నిషేధ భృతికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ మేరకు రూ.10వేలు వేట నిషేధ భృతి కోసం కమిషనరేట్‌ నుంచి బడ్జెట్‌ ప్రతిపాదనలు అడిగారు. అవి పంపించాం. అందుకే వేట నిషేధ భృతి కొంత మేర ఆలస్యమైంది. త్వరలో మంజూరు అయ్యే అవకాశం ఉంది.
– సంతోష్‌కుమార్, ఎఫ్‌డీఓ, పలాస

తుపాన్ల సమయంలో అండగా నిలవాలి
తుపానులు, అధిక వర్షా ల సమయంలో మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతోంది. రైతులకు ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ తుఫాన్ల సమయంలో మత్స్యకారులకు కూడా అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇసుక దిబ్బ లపై ఎండబెట్టిన ఉప్పు చేపలు పాడైతే నష్ట పరిహారం ఇవ్వాలి. మత్స్యకారులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణాలు అందించి సొసైటీలను బలోపేతం చేయాలి. వేటకెళ్లే మత్స్యకారుని ఖాతాలో నిషేధ భృతి జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలి.      
– జి.శంభూరావు, మత్స్యకారుడు.

మరిన్ని వార్తలు