-

పెద్ద చదువు.. చీప్ ట్రిక్!

21 Jun, 2015 11:11 IST|Sakshi
పెద్ద చదువు.. చీప్ ట్రిక్!

సాక్షి ప్రతినిధి, కడప: అత్యున్నత చదువు సమాజాన్ని ఉద్ధరించేందుకు ఉపయోగపడాలని, స్వకార్యానికి వ్యవస్థను అడ్డగోలుగా వాడుకోడవం సరికాదని రిమ్స్ హౌస్ సర్జన్ కె సుస్మిత కిడ్నాప్ డ్రామాపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత వ్యవహారాన్ని చక్కబెట్టుకునే క్రమంలో కె.సుస్మిత.. తన సహచరులు కొందరితో కలిసి కిడ్నాప్ డ్రామాను బాగా రక్తి కట్టించింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి రిమ్స్ హౌస్ సర్జన్ సుస్మిత కిడ్నాప్ అయ్యిందనే విషయం జిల్లాలో సంచలనం రేపింది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్భయ ఘటన, రిమ్స్ సమీపంలో ఆటోడ్రైవర్.. స్టాఫ్‌నర్సుపై ఆఘాయిత్యానికి పాల్పడటం తదితర ఘటనల నేపథ్యంలో సుస్మిత కిడ్నాప్ అయ్యిందనే వార్త విని ప్రజలు, విద్యార్థులు, రిమ్స్ యంత్రాంగం ఒక్కమారుగా తీవ్ర వేదనకు గురయ్యింది. ఉత్తమ వైద్య విద్యార్థినిగా కళ్లెదుట తిరుగాడిన సుస్మితపై దుండగలు ఏ ఆఘాయిత్యానికి పాల్పడతారో నని ప్రాంతాలకు అతీతంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ చలించిపోయారు.

రిమ్స్ విద్యార్థులంతా ఖాజీపేట, మైదుకూరు, పోరుమామిళ్ల పరిసర ప్రాంతాల్లోని అడవుల్లోకి గాలింపు కోసం వెళ్లారు. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజూమున 4 గంటల వరకు నిద్రాహారాలు మాని వెతికారు. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న రిమ్స్ వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్‌లో వాకబు చేస్తూ ఉండిపోయారు. మహిళా మెడికోల తల్లిదండ్రులు ఫోన్లలో పలు జాగ్రత్తలు చెప్పారు. మీడియా ప్రతినిధులు సైతం గంట గంటకు వాకబు చేశారు.  

 కుటుంబ సభ్యులను దారిలోకి తెచ్చుకునేందుకే....
 తుదకు రిమ్స్ హౌస్‌సర్జన్ కిడ్నాప్ వ్యవహారమంతా కట్టుకథే అని పోలీసుల  విచారణలో వెల్లడైనట్లు సమాచారం. హౌస్‌సర్జన్‌లు సుస్మిత, సాధనారెడ్డిలు శుక్రవారం రాత్రి 7 గంటలకు హాస్టల్ నుంచి ఔటింగ్ అనుమతి తీసుకుని ఆటోలో కడపకు వచ్చారు. సుస్మితను బ్యూటీపార్లర్ వద్ద వదిలి తాను వైవిస్ట్రీట్‌లో షాపింగ్‌కు వెళ్లానని, గుర్తు తెలియని వ్యక్తులు సుస్మితను ఆటోలో తీసుకెళ్లినట్లు, తాను ఫోన్ చేసిన సందర్భంలో భయపడుతూ చెప్పిందని, దీంతో ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు సాధనారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జిల్లా పోలీసు యంత్రాంగం ఆగమేఘాలపై ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. వారికి తోడుగా రిమ్స్ వైద్య విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున మైదుకూరు పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయితే సుస్మిత తన వ్యక్తిగత వ్యవహారాన్ని చక్కబెట్టుకోవడంలో భాగంగా కుటుంబ సభ్యులను దారిలోకి తెచ్చుకోవడానికి ఈ నాటకానికి తెరలేపినట్లు రూఢీ అవుతోంది. కిడ్నాఫ్ డ్రామా తెరపైకి తెచ్చి, మైదుకూరు సమీపంలో సెల్‌ఫోన్ ఆఫ్ చేసి తాఫీగా హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. శనివారం ఉదయానికి సుస్మిత హైదరాబాద్‌లో సేఫ్‌గా ఉందని తెలుసుకున్న ప్రజానీకం ఓవైపు ఊపిరి పీల్చుకుంటూనే, ఇలా చేసి ఉండాల్సింది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఫేస్‌బుక్ యుగమిది..
 తాము మేజర్లమని, తన స్నేహితునితో వివాహం చేయించండని ఏ పెద్ద మనిషినో, పోలీసుస్టేషన్‌నో ఆశ్రయించి ఉంటే ఇంత మంది ఇలా ఆందోళనపడాల్సి వచ్చేది కాదు. అరకొర చదువుకున్న వారు సైతం ఆ దిశగా వెళ్లి ఒక్కటవుతుండగా, ఉన్నత చదువు చదువుతూ ఇలా చేయడం భావ్యం కాదనే వాదన వినిపిస్తోంది. శ్రీకృష్ణుడు,రుక్మిణి కళ్యాణం నాటి నుంచే ప్రేమ వివాహాలు ఉన్నాయి. ఏనాడో వచ్చిన బాలరాజు సినిమాలో అక్కినేని ప్రేమ పెళ్లి చోటుచేసుకుంది.

అలాంటిది శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో సుస్మిత తన ఇబ్బందిని ఓపెన్‌గా చెప్పుకుని ఉండింటే ఫేస్‌బుక్, వాట్సాఫ్ ద్వారా ప్రపంచం మద్దతు పలికేది. ఏం చేయాలో దిక్కుతోచని మానసిక స్థితిలో సుస్మిత ఇలా చేయాల్సి వచ్చిందా.. లేక మరేదైనా కారణం ఉందా.. ఇలా చేస్తేనే ఫలితం ఉంటుందని ఎవరైనా తప్పుదోవ పట్టిచ్చారా.. అనే వివరాలు విచారణలో తేలాల్సి ఉంది. కాగా, సుస్మిత, ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితుడు ఉదయ్‌ని కడప ఒకటవ పట్టణ సీఐ రమేష్ హైదరాబాద్ నుంచి శనివారం రాత్రి కడపకు తీసుకువచ్చారు.

మరిన్ని వార్తలు