ఉల్లి రైతుల్లో ‘ధర’హాసం

3 Dec, 2019 05:02 IST|Sakshi

రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ.10,180

చరిత్రలో ఇదే అత్యధిక ధర

 సబ్సిడీతో వినియోగదారులను ఆదుకుంటున్న ప్రభుత్వం

కర్నూలు (అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి రైతుల పంట పండుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేవు. గతంలో క్వింటాల్‌ ఉల్లికి అత్యధికంగా లభించిన ధర రూ.5,400 మాత్రమే. ప్రస్తుతం రూ.10,180 ధర పలకడం విశేషం. ఉల్లి పంటకు కర్నూలు జిల్లా పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి పేరు చెబితే కర్నూలు జిల్లా గుర్తొస్తుంది. దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పడటంతో ఈ జిల్లాపై జాతీయ స్థాయి వ్యాపారుల దృష్టి పడింది. జిల్లాలో పండిన ఉల్లి ఎప్పటికప్పుడు అమ్ముడైపోతుండటంతో ధరలు ఎగిసి పడుతున్నాయి.

రెండు, మూడేళ్లుగా ధరలు పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ధరలు పెరగడంతో వారి ఆనందం అంతా ఇంతా కాదు.  ఆదివారం కర్నూలు మార్కెట్లో క్వింటాల్‌కు అత్యధిక ధర రూ.7,570 పలికింది. సోమవారం రూ.10,180కి ఎగబాకింది. రాష్ట్రంలో పండుతున్న ఉల్లిలో 95 శాతం కర్నూలు జిల్లాలోనే పండిస్తున్నారు. జిల్లాలో 2018–19లో 34,158 హెక్టార్లలో ఉల్లి సాగు చేయగా.. 7,85,634 టన్నుల దిగుబడి వచ్చింది. 2019–20లో 32 వేల హెక్టార్లలో పంట సాగు కాగా.. 7,04,000 టన్నులు ఉత్పత్తి అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 2 వేల ఎకరాల్లో సాగు తగ్గగా.. ఉత్పత్తి 81,634 టన్నులు తగ్గింది. 

సబ్సిడీతో  ఊరట
ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రిటైల్‌ మార్కెట్‌లో ఉల్లి ధరలు షాక్‌ కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీపై కిలో ఉల్లి రూ.25కే పంపిణీ చేస్తుండటం ఊరటనిస్తోంది. వినియోగదారుల కోసం ప్రభుత్వం కూడా కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రోజుకు 100 నుంచి 120 టన్నుల వరకు ఉల్లి కొనుగోలు చేస్తోంది. కిలో ఉల్లిపై ప్రభుత్వం రూ.50కి పైగా సబ్సిడీ రూపంలో భరిస్తోంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా