గోదావరిలో జల సిరులు

4 Nov, 2019 03:38 IST|Sakshi

నీటి లభ్యత 4,156.22 టీఎంసీలకు పెరిగినట్లు సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడి

మొత్తం నీటి లభ్యతలో వ్యవసాయానికి వాడుకుంటోంది 569.689 టీఎంసీలే..

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి వరప్రదాయిని అయిన గోదావరి నదిలో నీటి లభ్యత భారీగా పెరిగిందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తేల్చింది. మొదటి ఇరిగేషన్‌ కమిషన్, సీడబ్ల్యూసీ మొదటి అధ్యయనం, బచావత్‌ ట్రిబ్యునల్‌ అంచనా వేసిన దానికంటే నీటి లభ్యత అధికంగా ఉన్నట్లుగా నిర్ధారించింది. 1965–84 మధ్య కాలంనాటి నదీ పరీవాహక ప్రాంతంలో వర్షపాతం, ప్రవాహాలు, ఆవిరి నష్టాలను పరిగణనలోకి తీసుకుని 1993లో మొదటిసారిగా అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ గోదావరిలో 3,902.062 టీఎంసీల (శతకోటి ఘనపుటడుగులు) నీటి లభ్యత ఉన్నట్లు తేల్చింది. తాజాగా 1985–2015 మధ్య కాలంలో నదీ పరీవాహక ప్రాంతంలో వర్షపాతం, ప్రవాహాలు, ఆవిరి నష్టాలను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ గోదావరిలో నీటి లభ్యత 4,156.22 టీఎంసీలకు పెరిగినట్లు గుర్తించింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే 3,094.751 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని నిర్ధారించింది. తొలిసారి అధ్యయనంలో తేల్చిన దానికంటే తాజాగా చేసిన అధ్యయనంలో 6.51 శాతం అధికంగా నీటి లభ్యత ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధ్యయన నివేదికను సీడబ్ల్యూసీ ఛైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌ ఇటీవల కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు అందజేశారు.

సాగుకు వినియోగిస్తోంది 13.7 శాతమే 
దేశంలో గంగా నది తర్వాత అతి పెద్ద నది గోదావరి. అపారమైన జలసిరికి నెలవైన గోదావరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో 1964–65 నుంచి 1984–85 వరకూ అంటే 20 ఏళ్ల పరిధిలో వర్షపాతం, ప్రవాహాలు, నీటి ఆవిరిలను పరిగణనలోకి తీసుకుని నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ తొలిసారిగా అధ్యయనం చేసింది. తాజాగా 1985–2015 మధ్య కాలంలో అంటే 30 ఏళ్ల పరిధిని తీసుకుని నీటి లభ్యతపై విస్తృతంగా అధ్యయనం చేసింది. ఏడాదికి సగటున 4,156.22 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు తేల్చింది. ఇందులో కేవలం 569.689 టీఎంసీలను మాత్రమే సాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. అంటే.. లభ్యమయ్యే నీటిలో కేవలం 13.70 శాతం జలాలను మాత్రమే సాగు కోసం వినియోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో గోదావరి డెల్టాలోనే సింహభాగం నీటిని వినియోగిస్తున్నారు. గృహ, పారిశ్రామిక తదితర అవసరాల కోసం 40.595 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నట్లు సీడబ్ల్యూసీ వివరించింది. నీటి లభ్యతలో అధిక భాగం.. అంటే ప్రతిఏటా ఏకంగా 3,408.921 టీఎంసీలు సముద్రంలో, ప్రవాహ నష్టాల రూపంలో పోతున్నాయని పేర్కొంది. గోదావరిలో విస్తారంగా లభిస్తున్న జలాలను నీటి కొరత ఉన్న కృష్ణా, పెన్నా నదీ పరీవాహక ప్రాంతాలకు మళ్లించడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికలు రచించారు. 

సీడబ్ల్యూసీ అధ్యయనంలోని ముఖ్యాంశాలు 
- గోదావరి నదీ పరీవాహక ప్రాంతం 1993 నాటికి 3,12,812 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అది తాజాగా 3,12,150 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. గతంతో పోల్చితే 662 చదరపు కిలోమీటర్లు తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. నదీ పరీవాహక ప్రాంతం మహారాష్ట్రలో 48.5 శాతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23.30, ఛత్తీస్‌గఢ్‌లో 12.5, మధ్యప్రదేశ్‌లో 8.6, ఒడిశాలో 5.7, కర్ణాటకలో 1.4 శాతం విస్తరించి ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 9.5 శాతం.  
గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో సగటున 877 నుంచి 1,493 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. 1965–84 మధ్య కాలంలో సగటున 1,062 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా.. 1985–2015 మధ్య కాలంలో సగటున 1,177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే గతంతో పోల్చితే 10.82 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 
1985–2015 మధ్య కాలంలో, 2013–14లో నదీ పరీవాహక ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. దాని పరిమాణం 17,047.787 టీఎంసీలు. గోదావరిలో 2013–14లో గరిష్టంగా 6,935.391 టీఎంసీల నీటి లభ్యత నమోదైంది. 2009–10లో నదీ పరివాహక ప్రాంతంతో కనిష్ట వర్షపాతం నమోదైంది. దాని పరిమాణం 10,178.049 టీఎంసీలు. ఆ ఏడాది గోదావరిలో నీటి లభ్యత కనిష్టంగా 2,587.137 టీఎంసీలుగా నమోదైంది. 
1993లో నిర్వహించిన అధ్యయనంలో గోదావరిలో 3,902.062 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన సీడబ్ల్యూసీ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో నీటి లభ్యత 4,156.22 టీఎంసీలకు పెరిగినట్లు తేల్చింది. గతంతో పోల్చితే తాజాగా 254.158 టీఎంసీలు(6.51 శాతం) పెరిగినట్లు పేర్కొంది. 
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఏటా సగటున 156.379 టీఎంసీల నీరు ఆవిరవుతోంది. మహారాష్ట్రలోని జైక్వాడ్‌ ప్రాజెక్టు.. తెలంగాణలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో నీటి ఆవిరి నష్టం అధికంగా ఉంది. 
గోదావరి పరీవాహక ప్రాంతంలో 1985 నాటికి 45,38,418 హెక్టార్ల ఆయకట్టు ఉండగా.. 2014–15 నాటికి 52,57,004 హెక్టార్లకు చేరింది. 30 ఏళ్లలో ఆయకట్టు 7,18,586 హెక్టార్లు మాత్రమే పెరిగింది. 

మరిన్ని వార్తలు