జలదిగ్బంధంలో వందలాది గ్రామాలు

3 Aug, 2013 04:36 IST|Sakshi

ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టినా ఎగు వ ప్రాంతమైన మహారాష్ర్టలో కురుస్తున్న భారీ వర్షాలతో పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ డివిజన్‌లలో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వందలాది గ్రామాల కు రాకపోకలు నిలిచాయి. పలు పల్లెలు జలది గ్బంధంలో చిక్కుకున్నాయి. చేలు నీటమునిగా యి. ఇల్లు నేలమట్టం అయ్యాయి. నదుల పరీ వాహక పల్లెల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కా లం వెళ్లదీస్తున్నారు. కొందరు ఎన్నికల సిబ్బంది ఇప్పటికీ ఇళ్లకు చేరుకోలేదు. పలు ఇళ్లు జల మయం అయ్యాయి. రూ.కోట్లలో నష్టం వాటిల్లింది.
 
 కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద గల ప్రాణహిత-చేవెళ్ల పైలాన్ నీటమునిగింది. చెన్నూరు సమీపంలో గోదావరి వద్దకు కర్మకాండకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. దహెగాం మండలం భీబ్రావాగులో గురువారం రాత్రి ఓ యువకుడు గల్లంతయ్యాడు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు వరదలతో ఆరుగురు మృతిచెందగా ఐదుగురి ఆచూకీ తెలియలేదు. పెన్‌గంగ ఉప్పొంగడంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వైపు వెళ్లే 44వ జాతీయ రహదారి ఆదిలాబాద్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రా-మహారాష్ట్ర సరిహద్దున రాకపోకలు నిలిచాయి. వరదల కారణంగా జిల్లాలో రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం వరద బాధితుల పునరావాసం కోసం రూ. 2.58 కోట్లు మాత్రమే విడుదల చేసింది. జిల్లాకు సహాయ బృందాలు కూడా చేరుకున్నాయి.
 
 పోటెత్తిన నదులు
 జిల్లాలో పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్రాలోని ఇసాపూర్ ప్రాజెక్టులో 13 గేట్లను ఎత్తి వరద నీటిని వదలడంతో దిగువన ఉన్న పెన్‌గంగ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీని ప్రవాహం ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బ్రిడ్జిని బలంగా తాకుతుండడంతో గురువారం రాత్రి నుంచి 44 జాతీయ రహదారిపై ఇరు రాష్ట్రాల పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రాకపోకలు నిలిపివేశారు. దీంతో హైదరాబాద్, నాగ్‌పూర్ మార్గంలో వందలాది భారీ వాహనాలు ఇరుపక్కల కిలోమీటర్ల పొడవునా నిలిచాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రవాహం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు పునరుద్ధరించారు. పెన్‌గంగ ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో జైనథ్ మండలంలోని పెండల్వాడ, కౌట, సాంగ్వి-కె, కరంజి, కాప్రి, ఉమ్రి, మాండగాడ, కామాయి, కేధారిపూర్ గ్రామాల్లోకి వరద నీరు చేరింది. కరంజి గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.
 
 బేల మండలంలో 8 గ్రామాలు ఇప్పటికే జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సిర్పూర్-టి మండలంలో తాటిచెట్టు ఒర్రె వద్ద పెన్‌గంగ బ్యాక్ వాటర్ కారణంగా నీటి ప్రవాహం పెరిగి వంతెన నీట మునిగింది. కౌటాల, బెజ్జూరు రాకపోకలు నిలిచాయి. నాటు పడవలను నిషేధించారు. లక్ష్మీపూర్, వెంకట్‌రావుపేట, ఉడికిలి, పరిగావ్, టొంకిని, జక్కాపూర్, మాకుడి గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బెజ్జూరు మండలంలోని తలాయి, తక్కపల్లి, బీమారం గ్రామాలది ఇదే పరిస్థితి. వేమనపెల్లి మండలం నీల్వాయివాగు ఉప్పొంగడంతో 25 గ్రామాలకు రాకపోకలకు నిలిచాయి. ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ మండలంలోని ఈ పరివాహక ప్రాంతంలో వందలాది ఎకరాల చేలు నీట మునిగాయి. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మంచిర్యాలలోని గౌతమీశ్వరి ఆలయం వరకు భారీగా వరద నీరు వచ్చింది. లక్సెట్టిపేట నుంచి కరీంనగర్ వైపు వెళ్లే దారిలో రాయపట్నం వంతెన రాత్రి నుంచి ఉదయం వరకు నీట మునిగే ఉంది. జైనూర్‌లో పత్తి, సోయ పంటలు వందల ఎకరాలు నీట మునిగాయి. తాంసి మండలంలో వేల ఎకరాల్లో పత్తి, సోయా పంటలు నీట మునిగాయి. 80కిపైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాగా వర్షాలు, వరదలతో అల్లాడుతున్న జిల్లాలకు 40 మందితో కూడిన మరో జాతీయ విపత్తుల సహాయదళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) జిల్లాకు చేరుకుంది.
 
 నీటమునిగిన ప్రాణహిత పైలాన్
 కౌటాల మండలంలో ప్రాణహిత-పెన్‌గంగ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండలం గుండాయిపేట, విర్దండి, రణవెల్లి, సాండ్‌గాం, తుమ్మిడిహెట్టి వద్ద గల ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం పైలాన్ వరద నీటిలో మునిగింది. వార్దా ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నదిలోకి భారీస్థాయిలో నీరు చేరుతోంది. మహారాష్ట్రలోని బండారా, నాందేడ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున నదిలో నీటిమట్టం పెరిగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వరదనీరు రెండు రోజులుగా పెరుగుతున్నందున్న గ్రామాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కౌటాల తహశీల్దార్ విశ్వంబర్ నదీ తీరగ్రామాలలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. నీటిమట్టం ఎక్కువగా ఉన్నందున పడవల్లో ప్రయాణికులను తరలించడం, చేపలు పట్టేందుకు వెళ్లడం ఆపివేయాలని ఆయన సూచించారు. పరిస్థితిపై ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నట్లు ఆయన తెలిపారు.
 
 వరద గోదారి
 శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 99 వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో 17 గేట్ల ద్వారా 75 వేల క్యూసెక్కులను వరద, కాకతీయ, సరస్వతీ కాల్వల ద్వారా విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు నుంచి దిగువకు వరద నీరు పోటెత్తడంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. నది సమీపంలో ఒర్రెల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. కడెం ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ఒక గేటు ద్వారా 7,155 క్యూసెక్కులు విడుదల చేశారు. గడ్డెన్నవాగుకు 3 గేట్ల ద్వారా 6,600 క్యూసెక్కుల నీటిని, స్వర్ణ ప్రాజెక్టు నుంచి ఒక గేటు ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
 
 నష్టం అపారం
 జిల్లాలో గత నెల 15 నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటి వరకు 50 మండలాల్లో రూ.100 కోట్లకు పైగా నష్టం సంభవించింది. 38 మండలాల్లోని 667 గ్రామాల్లో 1.07 లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. రూ.35.75 కోట్లు రైతులు నష్టం చవిచూసినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పత్తి, సోయా, కంది, జొన్న, పెసర, మొక్కజొన్న తదితర పంటలు ఉన్నాయి. టమాట నారుమల్లు సుమారు 2 వేల ఎకరాల్లో, పసుపు 200 ఎకరాల్లో, సుగంధ ద్రవ్యాల పంటలు 200 ఎకరాల్లో నష్టం సంభవించింది. 6,536 పక్కా, కచ్చ ఇళ్లు నేలమట్టమయ్యాయి. 600 కిలోమీటర్ల పొడవున ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటిని తాత్కాలికంగా పునరుద్ధరించాలంటేనే రూ.12 కోట్ల పైబడుతుందని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. పూర్తిస్థాయిలో పునరుద్ధరణకు రూ.150 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

మరిన్ని వార్తలు