హైవే కిల్లర్ మున్నా అరెస్ట్

16 Jan, 2014 04:42 IST|Sakshi

కర్నూలు, న్యూస్‌లైన్: జాతీయ రహదారులపై వెళుతున్న లారీలను అటకాయించి డ్రైవర్లను కిరాతకంగా చంపే నేర చరిత్ర గల మహమ్మద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. గతేడాది నవంబర్ 5వ తేదిన కర్నూలులోని లక్ష్మినగర్‌కు చెందిన నారాయణరెడ్డి కుమారుడు గంగాధర్‌రెడ్డిని కిడ్నాప్ చేసిన కేసులో మున్నాను మూడో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.
 
 డబ్బు కోసం గంగాధర్‌రెడ్డిని కేఏ 04 ఎండి 8802 ఇన్నోవా కారులో కిడ్నాప్ చేసి కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో బంధించి డబ్బులు డిమాండ్ చేశాడని, తప్పించుకుని కర్నూలుకు వచ్చి ఈనెల 13వ తేదిన గంగాధర్‌రెడ్డి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూడో పట్టణ సీఐ అబ్దుల్ గౌస్ తన సిబ్బందితో మంగళవారం 11.30 గంటల సమయంలో నంద్యాల రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా నంద్యాల వైపు నుంచి కేఏ 04 ఎండి 8802 నంబరు గల ఇన్నోవా వాహనం కర్నూలులోకి అతి వేగంగా అనుమానాస్పదంగా వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
 
 వాహనాన్ని అపు చేసి డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతన్ని పట్టుకుని విచారించగా తన పేరు అబ్దుల్ సమద్ కరీం అలియాస్ మున్నా అని తెలియజేయడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అతని నేరాల చిట్టా బయట పడింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఇస్లామ పేటలో మున్నా నివాసముంటున్నారు. పదో తరగతివరకు అక్కన్నే చదువుకున్నాడు. ఇతనికి భార్యతో పాటు ముగ్గురు సంతానం. 2012 అక్టోబర్‌లో ఒంగోలు సబ్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కొంతకాలం జీవనం సాగించాడు. హైదరాబాద్, బెంగుళూరు, వైజాగ్, ఒంగోలులో వ్యాపారాల పేరుతో ప్రజలను భారీ ఎత్తున మోసం చేసి అక్కడి నుంచి మకాం మార్చాడు. ఆరు నెలల క్రితం కర్నూలుకు వచ్చి లక్ష్మినగర్‌లో నివాసముంటన్న గంగాధర్‌రెడ్డితో పరిచయం ఏర్పరచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం అతనితో రూ.15 లక్షలు తీసుకొని ఎలాంటి ప్లాట్లు చూపించకుండా మొహం చాటేశాడు. డబ్బులు తిరిగి చెల్లించాలని గంగాధర్‌రెడ్డి అతనిపై ఒత్తిడి చేయడంతో తన డ్రైవర్ మధుసూధన్‌రెడ్డి, కుమార్, శ్రీనాథ్ అనే వ్యక్తులతో కలిసి గంగాధర్‌రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు విచారణలో అంగీకరించాడు.
 
 మున్నా నేరాల చిట్టా...
  2002 సంవత్సరంలో కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జంట హత్య కేసులో నిందితుడు.
  2003లో ఒక వ్యక్తిని మోసం చేసి బంగారం చోరీ చేసిన కేసులో నిందితుడు
   2004లో తెనాలి దగ్గర దుగ్గిరాలలో ముగ్గురిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు
  2006లో రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్త నిధుల కేసులో నిందితుడు
  2008లో ఒంగోలు చుట్టు పక్కల తిరుగుతున్న ఐరన్ ఓర్ లారీ ఓనర్లు, క్లీనర్లను హత్య చేసిన కేసులో ముద్దాయి
  ఒంగోలు తాలుకా మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరాయ కొండ, నల్గొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతనిపై అనేక  కేసులు ఉన్నాయి.
 
  2008 సంవత్సరంలో ఒంగోలు పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపగా 2012 చివరి వరకు జైలు జీవితం గడిపాడు. కొంతకాలం తర్వాత మళ్లీ నేరాల బాట పట్టాడు.
 

మరిన్ని వార్తలు