గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉల్లి లొల్లి

15 Aug, 2013 05:04 IST|Sakshi
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉల్లి ధర బెదరగొడుతోంది. విని యోగదారులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. దీనికంతటికీ కారణంతగ్గిన దిగుబడులు కొంతయితే.. దళారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత తోడయింది. రెండు నెలల క్రితం పరిగి మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లి రూ.800 నుంచి రూ.1000 పలికితే ప్రస్తుతం ఈ ధర రూ.ఐదు వేలకు చేరిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఒక్కో రైతు క్వింటాలుకు రూ.నాలుగు వేల వరకు నష్టపోవాల్సి వచ్చింది. 
 
ఇదే సమయంలో రైతు నుంచి కొనుగోలు చేసి రెండు నెలలు నిల్వచేసిన దళారులు క్వింటాలుకు రూ.నాలుగు వేలు లాభపడుతున్నారు. ఆరు నెలలు కష్టపడి పండించిన రైతుకు ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.35 వేలు రాగా అదే రెండు నెలలు నిల్వచేసిన దళారులు 25 నుంచి 30 క్వింటాళ్లకు రూ.లక్ష వరకు లాభపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. 
 
తగ్గిన సాగు విస్తీర్ణం..
దళారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత.. ఏటా తగ్గుతున్న ఉల్లిసాగు విస్తీర్ణం.. పెరుగుతున్న వినియోగం కూడా ఉల్లి ధరలు ఆకాశాన్నంటడానికి కారణాలుగా చెప్పవచ్చు. పరిగి మండల పరిధిలో ఐదారేళ్లుగా ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఇదే సమయంలో సీజన్‌లో రైతుల నుంచి ఉల్లిగడ్డలు కొనుగోలు చేస్తున్న దళారులు అక్రమంగా నిల్వచేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జిల్లాలో 312 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 241 హెక్టార్లలో పంట సాగవుతుందని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. వినియోగం పెరుగుతున్న క్రమంలో సాగును ప్రోత్సహించాల్సిన అధికారులు ఆ విషయం పట్టించుకోవటమే మరిచారు.  
 
జిల్లాలో యేటా మర్పల్లి మండలం పంచలింగాల, పట్లూర్, సిరిపురం, వీర్లపల్లి, ఘనాపూర్, మర్పల్లి, కొత్లాపూర్, నర్సాపూర్ గ్రామాల్లో రబీలో 500 ఎకరాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేసేవారు. రెండేళ్లుగా ఉల్లికి సరైన ధర పలకపోవటం.. కరెంటు కోతలు, వాతావరణం అనుకూలించక పంట దిగుబడు లు తగ్గి రైతులు పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూశారు. ఈ సీజ న్‌లో రోజుకూ 800 క్వింటాళ్ల ఉల్లిగడ్డ శంకర్‌పల్లి మార్కెట్ వస్తుండగా... ఇప్పుడు మాత్రం కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే బీట్ అవుతున్నాయి. 2011-12లో ఉల్లి పంట సాగుచేసి నష్టపోయిన రైతులకు ఇంత వరకూ పరిహారం డబ్బులు అందకపోవటంతో పత్తి, మొక్కజొన్న, కంది పంటల సాగుపై దృష్టి సారించారు. దీంతో ఉల్లి సాగు గణనీయంగా పడిపోయింది. 
 
నిలిచిపోయిన దిగుమతులు..
హైదరాబాద్ నగరానికి చుట్టు ప్రక్కల జిల్లా ఉండటంతో ఉల్లిగడ్డలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. నిత్యం సుమారు 400 నుంచి 500 మెట్రిక్ టన్నుల మేర ఉల్లిగడ్డలు అవసరం ఉంటుందని ఉద్యాన శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు జిల్లాలో దిగుబడులు లేకపోవటంతో ఉల్లికి ధరలు పెరగడం మరో కారణంగా చెప్పవచ్చు. వర్షాకాలంలో ప్రతి యేటా అహ్మదాబాద్, పుణేలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఉల్లి పెద్ద మొత్తంలో దిగుబడులు దిగుమతి జరిగేవి. కానీ అక్కడ కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతినటం, దిగుబడులు అంతంత మాత్రంగా ఉండటంతో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజులుగా కర్నూలు నుంచి దిగుమతి చేసుకొనే ఉల్లిగడ్డకు సమైక్యాంధ్ర ఉద్యమంతో రవాణా స్తంభించింది. దీంతో దిగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.80 పలుకుతోంది.
 
ధరల అదుపులో విఫలమైన ప్రభుత్వం 
పేదలకు రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను అందిస్తున్నామంటూ ప్రచార ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం ఉల్లి ధరలకు కళ్లెం వేయలేకపోతోంది. దీంతోపాటు ఇతర కూరగాయల ధరలను అదుపు చేయడంలోనూ విఫలమవుతోంది. 
మరిన్ని వార్తలు