విద్యార్థి కన్నుమీద బెత్తం దెబ్బ

26 Sep, 2018 07:11 IST|Sakshi
వాచిపోయిన బాబూరావు కన్ను

వాచి, ఎర్రగా మారిన బాబూరావు కన్ను

మాతల జెడ్పీ ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్‌నిర్వాకం

శ్రీకాకుళం, కొత్తూరు: పాఠశాలల్లో బెత్తాలు వినియోగించి విద్యాబోధన చేయవద్దని చట్టాలు చెప్పుకొస్తున్నాయి. కానీ ఆ పాఠశాలలో బెత్తం ఉపయోగించి విద్యాబోధన చేయడంతో ఓ విద్యార్థి కన్ను మీద బెత్తం దెబ్బ పడటంతో అతడి కన్ను ప్రమాదకరంగా మారింది. బాధిత విద్యార్థి చెప్పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాతల జెడ్పీ ఉన్నత పాఠశాలలో మాతల గ్రామానికి చెందిన మజ్జి బాబూరావు పదో తరగతి చదువుతున్నాడు. గ్రామంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనం చేయడంతో బాబూరావు సోమవారం పాఠశాలకు సెలవు పెట్టి మంగళవారం వెళ్లాడు. సోమవారం పాఠశాలకు ఎందుకు రాలేదని పాఠశాలలో హిందీ బోధిస్తున్న ఉపాధ్యాయురాలు కామేశ్వరి బెత్తంతో బాబూరావును కొట్టింది.

బెత్తం దెబ్బ బాబూరావు కుడికన్ను మీద బలంగా తగలడంతో కన్ను వాపురావడంతో పాటు ఎరుపు రంగుగా మారింది. ఆ సమయంలో పాఠశాల చివరి పీరియడ్‌ కావడం, అందుబాటులో హెచ్‌ఎం భాస్కరరావు లేకపోవడంతో విద్యార్థి నేరుగా ఇంటికి వచ్చి అన్నయ్య రాజేశ్వరరావుకు జరిగిన విషయాన్ని వివరించాడు. పాఠశాల సమయం పూర్తికావడంతో ఉపాధ్యాయురాలిని అడగలేక పోయామని చెప్పారు. పాఠశాలకు ఐదుగురు సెలవు పెట్టారని, అందరికీ బెత్తంతో కొట్టినప్పటికీ నాకు మాత్రం బలంగా ఉపాధ్యాయురాలు కొట్టారని బాబూరావు వివరించాడు. కంటి మీద కొట్టడంతో ఆందోళన కలిగిస్తుందని విద్యార్థి అన్నయ్య తెలిపాడు. ఏ రోజు కూడా తన తమ్ముడు బాబూరావు పాఠశాలకు సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉండలేదన్నారు. పిల్లలను బెదిరించాలి తప్ప ఈ విధంగా కొట్టడం బాధాకరంగా ఉందన్నారు. కాగా, ఈ విషయంపై ఉపాధ్యాయురాలు కామేశ్వరిని ‘సాక్షి’ వివరణ కోరేందుకు అందుబాటులో లేకపోవడంతో పాటు సెల్‌ ఫోన్‌కు ఫోన్‌ చేసిన లిఫ్టు చేయకపోవడంతో హెచ్‌ఎం భాస్కరరావు వద్ద ప్రస్తావించగా సంఘటన జరిగిన సమయంలో తాను పాఠశాలలో లేనని చెప్పారు. జరిగిన సంఘటనపై ఉపాధ్యాయురాలు, బాధిత విద్యార్థి తనకు తెలపలేదని అన్నారు.  

మరిన్ని వార్తలు