డీఎస్సీలో హిందీ పండిట్లకు అన్యాయం

14 Nov, 2018 07:00 IST|Sakshi
డీఎస్సీలో అన్యాయం జరిగిందంటున్న నిరుద్యోగ హిందీ పండిట్లు

విజయనగరం :ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డీఎస్సీలో హిందీ పండిట్లకు తీవ్ర అన్యాయం చేసింది. ఐదేళ్లుగా  డీఎస్సీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసాం. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ విజయగరం జిల్లాకు హిందీ పండిట్‌ పోస్టులు కేవలం ఆరు మాత్రమే ఖాళీ చూపించింది. మా ఆశలు అడియాసలు చేసింది. ఆర్‌టీఐ యాక్ట్, త్రిభాషా సూత్రం ప్రకారం ప్రతీ ప్రాథమిక పాఠశాలలో ఒక హిందీ పండిట్‌ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు.  హిందీ పండిట్‌ నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే హిందీ పండిట్‌ నిరుద్యోగులందరికీ న్యాయం చేకూర్చాలి– పట్నాన రాంబాబు, గంగూలి, సంజీవినాయుడు, జి.రమేష్, బి.రాము, కె.శివకుమార్, నిరుద్యోగ హిందీ పండిట్లు

విశ్వ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి..
రాష్ట్రంలో ఉన్న విశ్వ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారించాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ విశ్వబ్రాహ్మణులకు గృహ పథకం, ఆదరణ, బీసీ కార్పొరేషన్‌ వంటి అనేక పథకాలు అమలు చేశారు. ఆ పథకాల వల్ల విశ్వబ్రాహ్మణులు ఎంతో లబ్ధి పొందారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు విశ్వబ్రాహ్మణుల కోసం ఎటువంటి పథకాలు అమలు చేయకపోవడంతో పంచ, వడ్రంగి, గోల్డ్‌స్మిత్, కమ్మరం, కంచరం, శిల్పి తదితరులంతా దీనస్థితిలో మగ్గిపోతున్నారు.–అలజంగి క్రిష్ణ, ఏపీ విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు

వితంతు పింఛన్‌ ఇవ్వడం లేదు...
2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేశానని స్థానిక ప్రజాప్రతినిధులు  నాకు  వితంతు పింఛన్‌ ఇవ్వడం లేదు. మూడేళ్ల క్రితం నా భర్త బంగర్రాజు అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి వితంతు ఫింఛన్‌ ఇవ్వాలని ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అధికార పార్టీకి చెందిన నాయకులు నాకు ఫింఛన్‌ మంజూరు కాకుండా చేస్తున్నారు. కూలి పనులు చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి నాది.
– మత్స పాపమ్మ, తూరుమామిడి, మక్కువ

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి...
అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి.  మా గ్రామంలో ముగ్గురు ఏజెంట్ల ద్వారా 300 మంది సుమారు రూ.50 లక్షల వరకు అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేశాం. ఎంతో శ్రమపడి పైసా పైసా కూడబెట్టి భవిష్యత్‌లో అవసరాలు తీర్చుకుందామని కట్టాం. అగ్రిగోల్డ్‌ ఎత్తేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. మా బాధను విన్న జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే అందరు బాధితులకు ప్రతీ పైసా చెల్లించేలా చూస్తానని భరోసా ఇచ్చారు.–వెంకటబైరిపురం అగ్రిగోల్డ్‌ బాధితులు

దివ్యాంగ పింఛన్‌ ఆపేసారు...
దివ్యాంగుడినైనా నాకు వైఎస్సార్‌ హయాంలో ఇచ్చిన పింఛన్‌ను టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆపేసారు. పింఛన్‌ను పునరుద్ధరించాలని ఎన్నోమార్లు అధికారులకు వేడుకుంటున్నా...పట్టించుకోవడం లేదు. కాలికి అంగవైకల్యం ఏర్పడడంతో కూలి పనులకు వెళ్లలేకపోతున్నాను. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. పింఛన్‌ మంజూరుచేస్తే నా జీవనానికి భరోసా ఉంటుంది.– ఉమ్మి శ్రీను, డి.సిర్లాం, మక్కువ

మరిన్ని వార్తలు