టీటీడీ బోర్డులో నియామకాలపై నిరసనలు

22 Apr, 2018 11:59 IST|Sakshi
పుట్టా సుధాకర్‌ యాదవ్‌, బొండా ఉమా, వంగలపూడి అనిత

కొత్త బోర్డును రద్దు చేయాలని డిమాండ్‌

సాక్షి, అమరావతి/సాక్షి, తిరుమల/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి నియామకం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అన్య మతస్థులను, రౌడీయిజం చేసే వారిని, ఆధ్యాత్మిక–సేవా భావం లేనివారిని టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించారని హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏడాది పాటు అధికారుల పాలనలో సాగిన టీటీడీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్త బోర్డును నియమించిన సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌పై అన్యమత ప్రచార కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన నియామకంపై హిందూ పీఠాధిపతులు, మఠాధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం లెక్కచేయలేదు.

అలాగే బోర్డులో సభ్యురాలుగా నియమితులైన టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విషయంలోనూ హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాను అన్య మతస్థురాలినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్న అనితకు ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. హిందూ ధార్మిక సంస్థలో రాజకీయ లబ్ధి కోసం అన్య మతస్థులకు చోటు కల్పించడం దారుణమని హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కొత్త బోర్డును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.  

రాయపాటి సాంబశివరావు అసంతృప్తి
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును బోర్డు సభ్యుడిగా నియమించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో బ్రాహ్మణుల సత్రాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన బొండాకు టీటీడీ బోర్డులో ఎలా పదవి ఇస్తారని బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు నిలదీశారు. అలాగే తనను టీటీడీ సభ్యుడిగా నియమించడంపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కినుక వహించారు. తాను టీటీడీ చైర్మన్‌ పదవి అడిగితే ఇవ్వకుండా, సభ్యుడిగా నియమించి అవమానించారని ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్నా మహారాష్ట్ర మంత్రి సుధీర్‌ ముంగటివర్‌ సతీమణి సప్నను టీటీడీ బోర్డులో సభ్యురాలిగా నియమించడం గమనార్హం. రాజకీయ లబ్ధి కోసమే ఆమెకు టీటీడీ బోర్డులో చోటు కల్పించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త బోర్డులో తమకు అవకాశం కల్పిస్తారని టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు ఆశించారు. అవకాశం రాని వారు పార్టీకి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు టీటీడీ బోర్డులో తమిళనాడుకు ప్రాతినిధ్యం లేకపోవడం దారుణమని ఆ రాష్ట్రానికి చెందిన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

మరిన్ని వార్తలు