‘ఉపాధి’తో సాగుకు ఊతమివ్వండి: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ 

5 Jul, 2019 06:26 IST|Sakshi

సాక్షి, అనంతపురం:  ‘ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యం.. కరువు జిల్లా ‘అనంత’లో రైతులు కుదేలయ్యారు. పదిమందికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రా...అంటూ ఉపాధి లేక పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు ఉపయోకరంగా ఉంటుంది’ అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు.

గురువారం ఆయన పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. జిల్లాలో నెలకొన్న కరువు, రైతుల దుస్థితి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇంగ్లిషులో ప్రసంగించారు. తీవ్ర కరువుతో కొట్టుమిట్టాడుతున్న అనంతపురం జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు ఎంతో గౌరవింపబడుతున్న ఈ దేశంలో తీవ్ర కరువుతో పూటగడవక  కొందరు వ్యభిచార గృహాలకు తరలిపోతుండగా...మరికొందరు ఉపాధి కోసం కుటుంబాలను వదిలి గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు..?. ఢిల్లీకి కూత వేటు దూరంలోనే వ్యభిచార గృహాలు  నడుస్తున్నాయన్నారు.

మరోవైపు బడికి వెళ్లాల్సిన పసి పిల్లలు రోడ్లుపై తిరుగుతూ కనిపిస్తున్నారన్నారు. నిర్బంధ ఉచిత విద్య చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు. లేదంటే పిల్లలు భవిష్యత్తులో జాతికి బరువుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రవాదులు, టెర్రరిస్టులుగా మారితే ఆరోజు వారిని అదుపు చేసేందుకు రూ.వంద ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. అదే  నేడు రూ.10 ఖర్చు చేసి బడిలో చేర్పిస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.    

మరిన్ని వార్తలు