కొండగుట్టల్లో.. చారిత్రక ఆనవాళ్లు!

12 Jul, 2019 10:24 IST|Sakshi
కొండవీడు కొండలపై లభించిన ఆనవాళ్లు

సాక్షి, యడ్లపాడు(గుంటూరు) : శతాబ్దాల నాటి చరిత్రను పుటలుగా దాచుకున్న కొండవీడుకోటలో అప్పుడప్పుడు అలనాటి అవశేషాలు కనిపిస్తూ అందరిని అబ్బురపరుస్తూనే ఉన్నాయి. చరిత్ర ఖజాన కొండవీడు కొండలపై గురువారం ఓ రాతితొట్టి బయల్పడింది. అసలు యంత్రాలు ఊసేలేని నాటి కాలంలో ఏకరాతిని ఏమాత్రం పగళ్లు రాకుండా తొలచి 4 అడుగుల పొడవు, 1.5 వెడల్పు, అడుగులోతుతో తయారు చేసిన ఈ తొట్టె క్రీ.శ.1400 నుంచి 1500 శతాబ్దాల కాలానికి చెందినదిగా తెలుస్తోంది. ఆనాటి కొండవీడు రాజధానిలోని అశ్వాలకు నీరు తాగించేందుకు దానిని ఉపయోగించి ఉంటారని కొందరు అభిప్రాయ పడుతుండగా.. అంతకు పూర్వం బౌద్ధభిక్షువులు ఈతొట్టిని ఏర్పాటు చేసుకున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది.

నాడు అరిటాకు ‘రాతి’ విస్తరి.. 
ఈ ఏడాది ఫిబ్రవరిలో కొండవీడు ఉత్సవాల సమయంలో సందర్శకులకు వసతుల ఏర్పాటు చేస్తున్న క్రమంలో అరిటాకును పోలిన రాతి విస్తరి దొరికింది. అరటి ఆకు, దాని ముందు 8 గిన్నెలను రాతిపై అద్భుతంగా ఏకరాతిపై చెక్కి ఉన్న రాతి విస్తరిని రెడ్డిరాజులు తమ పూజా కార్యక్రమంలో వినియోగించి ఉంటారని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు.

అంతకు కొద్ది రోజుల ముందే రాముడికి పరమభక్తుడైన ఆంజనేయస్వామి భారీ ప్రతిమను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఈ విగ్రహానికి పైభాగాన శ్రీనివాసుని శంఖు, చక్రాలు కూడా చెక్కి ఉండటం అధికారులనే కాదు పర్యాటకులను ఆలోచనల్లో పడేసింది. అప్పట్లోనే వీటికి రంగులు వేసి పర్యాటకులకు సందర్శనార్థం ప్రదర్శనుకు ఉంచారు. ఆ తర్వాత మ్యూజియంకు తరలించారు.

వెలుగుచూసిందిలా.. 
కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ కల్లి శివారెడ్డి కొండవీడు కొండలపై ప్రాంతాలను పరిశీలిస్తుండగా శిథిలమైన ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌కు పశ్చిమాన ఉన్న మార్గం మధ్యలో రాతి తొట్టి కనిపించింది. వెంటనే పురావస్తు, అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యంలో పనిచేసే ఉద్యోగులు తమ అశ్వాలకు నీటిని తాగించేందుకు ఈ ప్రాంతంలో తొట్టిని ఏర్పాటు చేసి ఉంటారని, ఈ తొట్టి లభించిన ప్రాంతానికి సమీపంలోనే మత్తడి (నీటివనరు) ఉండటం కూడా వారి వాదనను బలపరుస్తోంది. ఇదే ప్రాంతంలో అలనాటి నివాసాల ఆనవాళ్లు, రోళ్లు  పడి ఉన్నాయి. దీనికి అత్యంత సమీపంలోనే కొండరాయి చుట్టూ మర్రిఊడలు అల్లుకున్న సహజ సుందర దృశ్యం పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఉంది. 

మరిన్ని వార్తలు