మరోసారి మూడుముళ్లు పడిన ఆ రాత్రి..

10 Dec, 2017 10:31 IST|Sakshi

రాష్ట్రంలో తొలి వితంతు వివాహానికి వేదిక రాజమహేంద్రి

కందుకూరి ఇంట జరిగిన చారిత్రాత్మక ఘటన

బాల్య వివాహాలను నిరసిస్తూ ... వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ మహాకవి గురజాడ తన కన్యాశుల్కం నాటకం ద్వారా జాతిని జాగృతం చేశారు. సాహిత్యపరంగా గురజాడ యుద్ధం ప్రకటించగా కందుకూరి వీరేశలింగం ఈ దుష్ట సంప్రదాయంపై పిడికిలి బిగించారు. ప్రతిఘటనలు ఎదురైనా తన సతీమణి రాజ్యలక్ష్మి సహకారంతో రాష్ట్రంలోనే తొలి వితంతు వివాహం 1881 డిసెంబర్‌ 11వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలో జరిపించారు. ఆ బృహత్తర ఘట్టానికి ... చరిత్ర మలుపు తిప్పిన ఆ చారిత్రక శుభ ఘడియకు రాజమహేంద్రవరం వేదికగా నిలవడం జిల్లావాసులు గర్వించదగ్గ విషయం. ఈ వివాహానికి బాలిక తల్లే సూత్రధారిగా మారి ముందడుగు వేయడం ఓ విప్లవం. 136 సంవత్సరాల కిందట జరిగిన ఈ పరిణామం జాతి మలుపునకు దారితీసింది. 

రాజమహేంద్రవరం కల్చరల్‌ : ‘ఇప్పుడు యీ వెధవ ఇంగిలీషు చదువు నుంచి ఆ ఫకీరు వెధవ దాన్ని లేవదీసుకుపోయాడుగాని.. వైధవ్యం అనుభవించిన వాళ్లంతా పూర్వకాలంలో యెంత ప్రతిష్ఠగా బతికారు కాదు..’ ‘ప్రారబ్ధం చాలకపోతే (వైధవ్యం) ప్రతివాళ్లకీ వస్తుంది. చిన్నవాళ్లకిచ్చినా, పెద్దవాళ్లకిచ్చినా రాసినరాత యెవడైనా తప్పించగలడా?’ ‘వెధవముండలకి పెళ్లి చెయ్యడపు పోయీకాలం పట్టుకుందేవి పెద్దపెద్ద వాళ్ళకి కూడాను?’ ‘అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల ఎంతలాభం కలిగింది? భూవులకు దావా తెచ్చామా లేదా?’....... మహాకవి గురజాడ ‘కన్యాశుల్కం’లో అగ్నిహోత్రావధానులు నోట పలికించిన ఈ మాటలు చాలు, నాటి సమాజంలోని దురాచారాలను చూపడానికి. అగ్నిహోత్రావధానులు పాత్ర ఆకాశం నుంచి ఊడిపడలేదు. నాటి సమాజంలోని దుర్నీతిని కళ్ళారాచూసిన గురజాడ కలం ద్వారా ఈ బ్రహ్మాస్త్రాలు సంధిస్తే, కందుకూరి సంస్కరణోద్యమం ద్వారా ప్రత్యక్ష యుద్ధానికి తెరతీశాడు. ముక్కుపచ్చలారని బాలికను, డబ్బుకోసం కాటికి కాళ్లుచాపుకున్న వాడికి అంటగట్టడం,  ఆ బాలిక వివాహం అంటే అర్థం తెలుసుకునేలోపునే వితంతువు అయితే, ఆడదాని తల రాత అంతేనని సమాధానం చెప్పడంనాడు పరిపాటి.

తీవ్ర ప్రతిఘటనల మధ్య..
యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం చేపట్టిన వితంతు వివాహాలకు అసాధారణమైన ప్రతిఘటనలు ఎదురయ్యాయి. వంటవాళ్లు, మంత్రాలు చెప్పేవారిని సైతం అడ్డుకున్నారు. కందుకూరి సతీమణి రాజ్యలక్ష్మిద్వారా భర్తమీద ఈ ప్రయత్నాలు వదులుకోమని ఒత్తిడి తెచ్చారు.. అయినా, ఆమె కందుకూరికి బాసటగా నిలబడ్డారు. నాటి విద్యార్థిలోకం కందుకూరికి అండగా నిలబడింది. రాష్ట్రంలోనే తొలి వితంతు వివాహం 1881 డిసెంబర్‌ 11వ తేదీ రాత్రి జరిగింది. కందుకూరి ప్రాణాలు తీయడానికి కూడా నాటి కుహనా పండితులు  కొందరు వెనుకాడలేదు. 

సుమారు 136 సంవత్సరాలకు ముందు జరిగిన ఈ పునర్వివాహానికి మంత్రాలు చదివే యాజకునికి వంద రూపాయలు ఇవ్వవలసి వచ్చిందని కందుకూరి స్వీయచరిత్రలో వివరించారు. ఆ రోజుల్లో వందరూపాయలంటే, నేటి విలువ ఎంతో ఆర్థిక నిపుణులు అంచనా వేయవచ్చును. తొలి వితంతు వివాహానికి నాటి విద్యార్థిలోకం అండగా నిలిచింది. రక్షకభటశాఖ పూర్తి సహకారం అందించింది అన్నిటికీ మించి అర్ధాంగి పూర్తి సహకారం తోడైంది.

కందుకూరి స్వీయచరిత్రలో వితంతు వివాహం 
‘కృష్ణామండలం, తిరువూరు డిప్యూటీ తహసీల్దారు దర్భా బ్రహ్మానందము గారు తమ తాలూకాలోని గ్రామములో పండ్రెండేళ్ల యీడుగల ఒక వితంతువు (గౌరమ్మ) యున్నదని, తగు మనుష్యులను పంపగలిగినయెడల తల్లిని సమ్మతిపరచి యా చిన్నదానిని వారివెంట బంపునట్లు ప్రయత్నము చేసెదననియు, నాకొక లేఖను వ్రాసిరి. ఈ విషయమయి కొంత యుత్తరప్రత్యుత్తరములు జరిగిన తరువాత నా మిత్రుడు తిరువూరు నుండి 1881వ సంవత్సరం నవంబరు నెల అయిదవ తేదీన నాకిట్లు వ్రాసెను. ‘ఇక్కడకు మీ మనుష్యులను పంపుతోడనే తన కొమరితను మీ వద్దకు బంపెదనని యామె వాగ్దానము చేసినది. ఈ చిన్నదానిని వెంట బెట్టుకుని పోవుటకు నమ్మదగినవారును, ఋజువర్తనులను, దృఢచిత్తులునయిన మనుష్యులనుబంపుడు. వివాహము నిజముగా జరుగువరకు వారెందు నిమిత్తము వచ్చిరో యాపని యక్కడ నెవ్వరికి తెలియకుండవలెను. ఈ పని నిమిత్తము యిద్దరికంటె నెక్కువ మనుష్యులను పంపవలదని సీతమ్మ (బాలవితంతువుతల్లి) మిమ్ములను కోరుచున్నది.

విశాఖపట్టణములో రక్షకశాఖయందిరువది రెండు సంవత్సరముల ప్రాయముగల యొక చిన్నవాని భార్య యాకస్మికముగా మరణమునొందుట తటస్తించినది. అతడు చిరకాలము నా శిక్షణలో నుంచి పెరిగినవాడగుటచే వితంతు వివాహములు మొదలయిన కొత్తమార్పులందు ఆసక్తియు నుత్సాహము కలవాడు. వరుడు గోగులపాటి శ్రీరాములుగారని తెలిసిన తోడనే మా పట్టణమున యాతని బంధువులు మొదలయినవారు వచ్చి, వివాహము చేసుకోవలదని హితోపదేశము చేసి, కార్యము గానక మరలిపోవుచు వచ్చిరి.

‘మహాసంక్షోభమున’ 1881వ సంవత్సరము డిసెంబర్‌ 11వ తేదీ రాత్రి రాజమహేంద్రవరములో మొదటి స్త్రీపు పునర్వివాహము జరిగినది. పలువురు మార్గాంతరము లేక, ప్రాయశ్చిత్తములు చేయించుకొనిరి’    

11న వార్షికోత్సవం
కందుకూరి జన్మగృహంలో ఈ చరిత్రాత్మక సంఘటనకు ఆనవాలుగా తొలి వితంతు వివాహానికి గుర్తుగా కొన్నిశిల్పాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం కందుకూరి జన్మగృహంలో జరిగే తొలి వితంతు వివాహ వార్షికోత్సవంలో డాక్టర్‌ అరిపిరాల నారాయణరావు, వై.యస్‌.నరసింహారావు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు.

( కందుకూరి జన్మగృహంలో తొలి వితంతు వివాహానికి ఆనవాలుగా ఏర్పాటు చేసిన విగ్రహాలు )

మరిన్ని వార్తలు