పసిబిడ్డలకూ గండం

3 Sep, 2018 04:06 IST|Sakshi

హెచ్‌ఐవీ బాధిత గర్భిణుల ఆవేదన

బిడ్డకు వ్యాధి సోకకుండా ఇచ్చే నెవరపిన్‌ సిరప్‌ కొరత

నెల ముందు రాష్ట్రాలే సమకూర్చుకోవాలన్న కేంద్రం

పొరుగునే ఉన్న తెలంగాణ కొనుగోళ్లు చేసిన వైనం

ఏపీలో పట్టించుకోని ప్రభుత్వం

నెలకు వంద మంది హెచ్‌ఐవీ బాధితుల ప్రసవం

సాక్షి, అమరావతి: తొమ్మిది మాసాలు కడుపులో ఉన్నప్పుడే కాదు బిడ్డను ప్రసవించాక కూడా ఆ చిన్నారికి తల్లే రక్షణ కవచం. అలాంటి తల్లి నుంచే బిడ్డకు ప్రమాదం పొంచి ఉండటం ప్రమాదకరంగా పరిణమించింది. రాష్ట్రంలో సర్కారు నిర్లక్ష్యంతో పసిబిడ్డలకు జరుగుతున్న అన్యాయం ఇది. వివరాల్లోకి వెళితే.. మన రాష్ట్రంలో హెచ్‌ఐవీ బాధితులు నానాటికీ పెరుగుతున్నారు. హెచ్‌ఐవీ బాధిత మహిళలు గర్భం దాల్చితే వారి నుంచి  బిడ్డలకు హెచ్‌ఐవీ సోకకుండా ఉండాలంటే నెవరపిన్‌ సిరప్‌ విధిగా వేయాలి. అయితే రాష్ట్రంలో నెవరపిన్‌ సిరప్‌ పూర్తిగా అయిపోయింది. పొరుగునే ఉన్న తెలంగాణ ముందస్తు జాగ్రత్తతో కొనుగోలు చేసి నవజాత శిశువులకు అందిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. 

చిన్నారులకు పొంచివున్న ముప్పు
మన రాష్ట్రంలో నెలకు సగటున 100 నుంచి 120 మంది హెచ్‌ఐబీ బాధిత మహిళలు వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవానికి వస్తున్నారు. వీరి నుంచి చిన్నారులను కాపాడేందుకు నెవరపిన్‌ సిరప్‌ వేయాలి. దీన్ని కేంద్ర ఎయిడ్స్‌ నియంత్రణ మండలి (నాకో) సరఫరా చేసేది. అయితే రెండు నెలల క్రితం తాము సరఫరా చేయలేమని, రాష్ట్రాలే సమకూర్చుకోవాలని చెప్పింది. వెంటనే స్పందించిన తెలంగాణ రాష్ట్రం కొనుగోలు చేసింది. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లులు భయాందోళన చెందుతున్నారు. డాక్టరును అడిగితే స్టాకులేదని చెబుతున్నారని తల్లులు చెబుతున్నారు. తాము ఎలాగూ చేయని తప్పునకు విధివంచితులమయ్యామని, మా చిన్నారులను బలిచేయవద్దని వారు ఎంత బతిమలాడుకున్నా పట్టించుకునే వారేలేరు.

మాత్రను ఐదు సమభాగాలుగా చేసి...
నెవరపిన్‌ సిరప్‌ అనేది చిన్నారులకు వెయ్యడం చాలా సులభం. కానీ ఆ సిరప్‌ వెయ్యకుండా మాత్రలు వెయ్యాలని చెబుతున్నారు. ఆ మాత్రలేమో ఒక్కోటి 50 మిల్లీ గ్రాములవి. దీన్ని ఐదు సమభాగాలు చేసి దాన్ని తల్లిపాలలోగానీ, కాచి చల్లార్చిన పాలలోగానీ కలిపి తాగించాలి. కానీ ఈ మాత్రను ఐదు సమభాగాలు చేయడం కష్టం. ఎక్కువో తక్కువో అయ్యిందంటే బిడ్డకు ఇబ్బంది.  అధికారులేమో సిరప్‌ లేదు ఇక మాత్రలు వేసుకోవాల్సిందే అంటూ సెలవిస్తున్నారు. పుట్టిన రోజు నుంచి 6 వారాల వరకూ ఈ సిరప్‌ వెయ్యాలి. ఆ తర్వాత 18 వారాల వరకూ సెప్ట్రాన్‌ అనే సిరప్‌ వెయ్యాలి. ఆ సిరప్‌ను కూడా హెచ్‌ఐవీ బాధితులు వైద్యానికి వచ్చే ఐసీటీసీ సెంటర్లలో ఉంచకుండా ప్రభుత్వాసుపత్రుల్లోని సాధారణ ఫార్మసీలలో ఉంచుతున్నారు. అక్కడికే వచ్చి తీసుకోవాలని చెబుతున్నారు. అక్కడేమో మందుల కోసం జనం బారులు తీరి నిలబడి ఉండటంతో హెచ్‌ఐవీ తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. 

కేంద్రం సరఫరా ఆపేసింది
గతంలో కేంద్రం సరఫరా చేసేది. ఇప్పుడు ఆపేసింది. ఈ సిరప్‌ను తెప్పించేందుకు బెంగుళూరుకు చెందిన ఓ కంపెనీతో మాట్లాడాం. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం. అంతవరకూ మాత్రలను పౌడర్‌ చేసి ఐదు సమభాగాలుగా చేసి వెయ్యమని చెప్పాం. సిరప్‌ రాగానే సరఫరా చేస్తాం.
–డా.రాజేంద్రప్రసాద్, అదనపు సంచాలకులు (ఏపీశాక్స్‌)

మరిన్ని వార్తలు