హెచ్‌ఐవీ పంజా!

8 Oct, 2018 13:41 IST|Sakshi

జిల్లాలో పెరుగుతున్న     బాధితులు

ప్రతి ఏటా 3 వేలకుపైగా కొత్త కేసులు నమోదు

చోద్యం చూస్తున్న     అధికారులు

కాకిలెక్కలు చెబుతూ కాలక్షేపం

జిల్లాలో హెచ్‌ఐవీ వైరస్‌ పంజా విసురుతోంది. ప్రతి నెలా 250 నుంచి 300 కొత్త కేసులు నమోదవుతున్నారు. ఒక్క విజయవాడలోనే నెలకు వంద కేసులకు  తక్కువకాకుండా రికార్డవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే నివారణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. కాకిలెక్కలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. నిర్లక్ష్యం వీడకుంటే భారీమూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

లబ్బీపేట (విజయవాడ తూర్పు) :  పులిరాజాకు ఎయిడ్స్‌ వస్తుందా.. అంటూ మూడు దశాబ్దాల కిందట హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై విస్తృత ప్రచారం చేశారు. ఎయిడ్స్‌ ఎలా సోకుతుంది. రాకుండా ఏమి చేయాలనే దానిపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలతో హోరెత్తించారు. దీంతో దశాబ్దకాలం పాటు హెచ్‌ఐవీ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే రెండేళ్లుగా జిల్లాలో హెచ్‌ఐవీ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నెలా కొత్తగా 300 కేసులు నమోదవుతుండగా, ఏడాదిలో 3 వేల నుంచి 3,500 వరకూ నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.   అనధికారికంగా మరింత మంది ఉండవచ్చనేది అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలోనే హెచ్‌ఐవీ వ్యాప్తిలో జిల్లా మొదటి స్థానానికి చేరే అవకాశం ఉంది.

హెచ్‌ఐవీ వ్యాప్తి చెందుతుందిలా..
ఒకప్పుడు లైంగిక సంపర్కం ద్వారానే ఎక్కువగా హెచ్‌ఐవీ వ్యాప్తి చెందేది. ప్రస్తుతం బ్లడ్‌ బ్యాంక్‌ల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు నాసిరకంగా చేయడంతో రక్తమార్పిడి ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో యువత ఇటీవల కాలంలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. దీంతో ఒకరు వాడిన సూదిని మరొకరు వాడటం ద్వారా కూడా ఎయిడ్స్‌ వ్యాపిస్తున్నట్లు సమాచారం. హైటెక్‌ వ్యభి చారం జోరుగా సాగుతుండటం మరోకారణం.   

అధికారులు కాకి లెక్కలు
అధికారుల లెక్కల ప్రకారం 2015లో 33 వేలు ఉండగా, 2016లో 36 వేలకు చేరింది. 2017లో 39,500 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉండగా, తాజాగా 20 వేల మంది మాత్రమే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన 19,500 మంది ఏమయ్యారనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది.
 వారిలో సగం మంది మృత్యువాత పడగా, మిగిలిన వారిని ఆధార్‌ నంబర్‌ ఎన్‌రోల్‌ చేయకపోవడంతో పేర్లు తొలగించి, జిల్లాలో హెచ్‌ఐవీ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని కాకిలెక్కలు చెబుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకసారి హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చిన తర్వాత పూర్తిగా నివారణ సాధ్యం కాదు. అలాంటిది 39 వేల మందిని, ఇప్పుడు 20 వేలే ఉన్నట్లు చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతోంది.  

నాసిరకంగా నిర్ధారణ పరీక్షలు..
రాజమండ్రిలో ఓ గర్భిణికి హెచ్‌ఐవీ లేకుండానే  ఐసీటీసీ సిబ్బంది పరీక్షల నివేదికలో పాజిటివ్‌ అని ఇవ్వడంతో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అదేరీతిలో గతంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చిన హెచ్‌ఐవీ పాజిటివ్‌ రోగికి ర్యాపిడ్‌ పరీక్షలో నెగిటివ్‌ వచ్చింది. అయితే వైద్యులకు సదరు రోగి గతంలో పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పడంతో ఉలిక్కిపడ్డారు. మళ్లీ పరీక్ష చేయించగా పాజిటివ్‌ వచ్చింది. ఐసీటీసీల్లో సరఫరా చేసే కిట్‌లు నాసిరకంగా ఉండటంతో నిర్ధారణ పరీక్షల్లో సైతం ప్రామాణికం ఉండటం లేదు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
జిల్లాలో హెచ్‌ఐవీ కొత్త కేసులు ఏడాదిలో 2,500 నుంచి 3 వేల వరకూ వస్తున్నాయి. హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన కలిగించడంతో పాటు, రక్తపరీక్షలు చేసేందుకు సిబ్బంది ఉన్నారు. వారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. ఏఆర్‌టీల్లో సైతం సిబ్బంది సక్రమంగా పనిచేయకుంటే చర్యలు తప్పవు. అన్నింటినీ ఆకస్మికంగా తనిఖీ చేస్తాం. మా డీఎల్‌వో పర్యవేక్షిస్తుంటారు.  
– డాక్టర్‌ ఐ.రమేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి

మరిన్ని వార్తలు