ఎంఈవోపై హెచ్‌ఎం దాడి

13 Nov, 2018 13:15 IST|Sakshi
హెచ్‌ఎం దాడిలో తగిలిన దెబ్బలను చూపుతున్న ఎంఈవో సుబ్బారావు

పాఠశాల తనిఖీకి వెళ్లిన అధికారిపై దౌర్జన్యం

తరచూ స్కూల్‌కు వస్తున్నావేంటని మండిపాటు

కృష్ణాజిల్లా, ఘంటసాల (అవనిగడ్డ): స్కూల్‌ తనిఖీకి వెళ్లిన మండల విద్యా శాఖాధికారిపై సంబంధిత పాఠశాల హెచ్‌ఎం దాడి చేసిన ఘటన సోమవారం ఘంటసాల మండలం దేవరకోటలో చోటు చేసుకుంది. ఎంఈవో భృగుమళ్ల వెంకట సుబ్బారావు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల జరిగిన దేవరకోట గ్రామదర్శినిలో స్థానికులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీపీ పాఠశాల (ఆర్‌) లో 20 మంది విద్యార్థులు ఉన్నారని, ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే, ఒకరిని డెప్యూటేషన్‌పై వేరేచోటకు పంపారని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ మండల ప్రత్యేకాధికారి ఏడీవీ నారాయణరావుకు అర్జీ ఇచ్చారు. దీనిపై విచారించి వివరణ ఇవ్వాలని ఎంఈవో సుబ్బారావును ప్రత్యేకాధికారి ఆదేశించారు.

దీనిలో భాగంగా సోమవారం ఉదయం పాఠశాల తనిఖీకి ఎంఈవో వచ్చారు. హాజరు పట్టీ పరిశీలించారు. ఇరవై మంది విద్యార్థులకుగాను 14 మందే  హాజరయ్యారు. హాజరుకాని విద్యార్థుల పేర్లను ఎంఈవో నమోదు చేసుకుంటున్నారు. దీంతో కుర్చీలో ఉన్న ఎంఈవోను పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన బోలెం శ్రీనివాసరావు కిందకు తోసేశారు. దీంతో ఎంఈవో కింద పడిపోయాడు. తేరుకున్న ఆయన లేచి నిలబడగానే మెడమీద హెచ్‌ఎం చేయి వేసి గొంతు నొక్కడంతో పాటు దుర్భాషలాడారు. ప్రతిదానికి నా పాఠశాలకే వస్తున్నావేంటి.. అని ఎంఈవోతో హెచ్‌ఎం వాగ్వాదానికి దిగారు. తాను ఎంఈవోనని ఎప్పుడైనా వస్తానని చెప్పడంతో, నువ్వు ఎంఈవో అయితే నాకేంటి ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని హెచ్‌ఎం హెచ్చరించారు. తాను పాఠశాల తనిఖీకి వచ్చినట్లు సంతకం చేయాలి విజిటింగ్‌ బుక్‌ ఇవ్వమని ఎంఈవో కోరగా ఉగ్రుడైన హెచ్‌ఎం అందుకు నిరాకరించారు. దీంతో ఎంఈవో తన కార్యాలయానికి వచ్చేశారు. అనంతరం ఎంఈవో ఘంటసాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్‌ఎం బోలెం శ్రీనివాసరావు నుంచి తనకు ప్రాణహాని ఉందని, విధులు సక్రమంగా నిర్వహించడానికి తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఇదే విషయాన్ని విద్యా శాఖ ఉన్నతాధికారులకు కూడా తెలియజేసినట్లు ఎంఈవో సుబ్బారావు వెల్లడించారు.

మరిన్ని వార్తలు