విద్యార్థి ఫెయిలైతే.. బాధ్యత హెచ్‌ఎందే!

4 Dec, 2014 01:54 IST|Sakshi
విద్యార్థి ఫెయిలైతే.. బాధ్యత హెచ్‌ఎందే!

‘పది’ కసరత్తులో భాగంగా డీఈవో స్పష్టీకరణ
డివిజన్ల వారీగా సమావేశాల నిర్వహణ
గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో వెనుకబడ్డ జిల్లా
దిద్దుబాటు చర్యలో జిల్లా విద్యాశాఖ
 వ్యక్తిత్వ వికాస నిపుణులతో సదస్సులు
 పరీక్షలకు హాజరుకానున్న 54 వేల మంది విద్యార్థులు
 వచ్చే ఏడాది మార్చి 26 నుంచి పరీక్షలు

 
 ‘పదోతరగతి విద్యార్థి పరీక్షల్లో ఫెయిలైతే దానికి ప్రధానోపాధ్యాయులే బాధ్యులు..’ ఇవీ గుడివాడలో బుధవారం జరిగిన డివిజన్ స్థాయి ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.నాగేశ్వరరావు చెప్పిన మాటలు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలపై దృష్టిపెట్టిన జిల్లా విద్యాశాఖ ఇందుకోసం కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఆయన
 విద్యాశాఖ అధికారులు, హెచ్‌ఎంలతో సమీక్ష సమావేశాలు
 నిర్వహిస్తున్నారు.
 
 విజయవాడ :  జిల్లా విద్యాశాఖ పదోతరగతి పరీక్షల కసరత్తు మొదలైంది. ఇటు విద్యార్థులతో పాటు అటు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా ఈ పరీక్షలు సవాలుగా మారాయి. ఈ క్రమంలో ప్రణాళికాబద్ధంగా విద్యాబోధనతో పాటు ప్రత్యేక తరగతుల నిర్వహణ, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ప్రత్యేక సదస్సులు, పలు కార్యక్రమాలతో జిల్లా విద్యాశాఖ షెడ్యూల్ సిద్ధం చేసి కసరత్తు మొదలుపెట్టింది.

ఫలితాల్లో వెనుకబాటు...

చదువుల రాజధానిగా పేరొందిన జిల్లా పదోతరగతి పరీక్షా ఫలితాల్లో వెనుకబడింది. వరుసగా గత మూడేళ్లూ రాష్ట్రంలో మొదటి మూడు స్థానాలకు దూరంగా ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరగడంతో జిల్లాలోని విజయవాడ నగరం రాష్ట్ర రాజధాని అయింది. దీంతో పదోతరగతి పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదటి మూడు స్థానాల్లో నిలవడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. విద్యాశాఖ కమిషనర్ కూడా పదో తరగతి పరీక్షలపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం విద్యాశాఖ మొత్తం పదోతరగతి పైనే దృష్టి నిలిపింది. జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు 54 వేల మంది ఉన్నారు. వీరు కాకుండా ప్రైవేట్‌గా పరీక్షలు రాసే విద్యార్థులు ఆరువేల మంది ఉన్నారు. 54 వేల మంది విద్యార్థుల్లో 20 వేల మంది ప్రెవేట్ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 850 పాఠశాలలు ఉన్నాయి. గత ఏడాది పదోతరగతి పరీక్షల్లో జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఐదేళ్ల కిత్రం వరకు జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖ నాలుగు నెలలకు ముందే కసరత్తు మొదలుపెట్టింది.

ఈ నెల ఒకటి నుంచి ప్రత్యేక తరగతులు...

పదోతరగతి పరీక్షలకు మరో నాలుగు నెలల సమయం ఉన్న క్రమంలో విద్యాశాఖ ఈనెల ఒకటి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు 45 నిమిషాల పాటు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు పూర్తయిన సిలబస్‌పై రివిజన్‌తో పాటు సబ్జెక్ట్‌ల వారీగా పరీక్షలకు సిద్ధమయ్యేలా తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికిగాను రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో 25 పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించారు.

డివిజన్ల వారీగా సమావేశాలు...

మరోవైపు టీచర్లను కూడా పరీక్షలకు సమాయత్తం చేసేందుకు జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డివిజన్ల వారీగా మండల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత టీచర్లతో కూడా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు మచిలీపట్నం, నూజివీడు, గుడివాడలో సమావేశాలు నిర్వహించారు. బుధవారం నందిగామలో మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి నూరుశాతం ఫలితాలు సాధించే దిశగా అందరూ సమష్టిగా కష్టపడాలని సూచించారు. మరో వారం వ్యవధిలో విజయవాడ డివిజన్‌లో సమావేశం నిర్వహించి ఆ తర్వాత టీచర్లతో సమావేశాలు, పదోతరగతి విద్యార్థులకు బోధించే టీచర్లకు ఒరియంటేషన్ తరగతులు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.

మార్చి 26 నుంచి పరీక్షలు...

వచ్చే ఏడాది మార్చి 26 నుంచి పదోతరగతి పరీక్షలు మొదలవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం షెడ్యూల్ ప్రకటించారు. 26న మొదలై ఏప్రిల్ 11 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ క్రమంలో జనవరిలో అర్థసంవత్సర పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయం మరికొంత పెంచే అవకాశం ఉంది. ఈ విద్యాసంవత్సంలో నూరు శాతం ఫలితాలు రాబట్టి జిల్లాను మొదటి మూడు స్థానాల్లో ఉంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని డీఈవో నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు.
 

మరిన్ని వార్తలు