నో సర్వీస్‌

12 Nov, 2018 11:28 IST|Sakshi

ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్లలో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టని హెచ్‌ఎండీఏ

పూర్తి చేస్తే టోల్‌ తగ్గిపోతుందంటున్న అధికారులు  

నిధులున్నా మూడేళ్లుగా పట్టించుకోని వైనం  

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మకమైన ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వాహనదారులు అత్యంత వేగంగా ప్రయాణిస్తుంటారు. రోడ్డు నిర్మాణం.. నిర్వహణలో సరైన ప్రమాణాలు పాటించక జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. అయితే, హెచ్‌ఎండీఏ ఔటర్‌ రింగ్‌ రోడ్డు విభాగ అధికారులు సర్వీసు రోడ్ల విషయంలోనూ అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓఆర్‌ఆర్‌ను తాకుతూ వెళుతున్న రైల్వే ట్రాక్‌లను సాకుగా చూపి మూడేళ్లుగా సర్వీస్‌ రోడ్లలోబ్రిడ్జిల నిర్మాణాన్ని పక్కనపెట్టేసి ఆ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నారు. రెండు, మూడు కిలోమీటర్లు అదనం గా చుట్టూ తిరిగి గమ్యం చేరుతున్నారు. చేపట్టిన సర్వీస్‌ రోడ్ల నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఎక్కడికక్కడే నిలిపివేశారు. పైగా రైల్వే ట్రాక్‌ ఉన్న ప్రాం తంలో బ్రిడ్జిలు కడితే ‘టోల్‌ కలెక్షన్‌’ తగ్గిపోతుం దని చెబుతున్నారు. 2012లోనే ఓఆర్‌ఆర్‌తో పాటు సర్వీసు రోడ్డు నిర్మాణాలన్నీ పూర్తి చేయాలి. కానీ ఇప్పటికీ ఘట్‌కేసర్, మేడ్చల్, ఈదులనాగులపల్లి, శంషాబాద్‌ సమీపంలో ఓఆర్‌ఆర్‌ను తాకుతున్న రైల్వే ట్రాక్‌లకు అనుబంధంగా ఉన్న సర్వీసు రోడ్లపై వంతెనల నిర్మాణం చేపట్టలేదు. ఈదులనాగలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రైల్వేశాఖ అనుమతిచ్చినా ఇప్పటికీ పనులను చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

గౌడవెల్లి రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి నిర్మాణం చేయక..
ఘట్‌కేసర్‌ మండలంలోని గౌడవెల్లి రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో సర్వీసురోడ్డులో వాహనదారులు 3.5 కిలోమీటర్ల అదనంగా తిరగాల్సి వస్తోంది. గౌడవెల్లి పరిధిలో ఉన్న సికింద్రాబాద్‌–నాందేడ్‌ రైలు మార్గంలోనే రింగురోడ్డు నిర్మించారు. గౌడవెల్లి స్టేషన్‌ నుంచి రింగు రోడ్డు వెళుతోంది. ఘట్‌కేసర్‌ నుంచి వచ్చే రోడ్డులో సుతారిగూడ టోల్‌ప్లాజా వరకు సర్వీస్‌ రోడ్డు నిర్మించి వదిలేశారు. పటాన్‌చెరు వైపు నుంచి వచ్చే రోడ్డులో గౌడవెల్లి పరిధిలోని రాంరెడ్డి గార్డెన్‌ వరకు సర్వీసు రోడ్డు వేసి వదిలేశారు. దీంతో వా హనదారులు సుతారిగూడ టోల్‌ ప్లాజా నుంచి గౌడవెల్లి గ్రామం మీదుగా 3.5 కి.మీ తిరిగి జ్ఞానాపూర్‌ బ్రిడ్జి వద్ద సర్వీస్‌ రోడ్డు తేరుతున్నారు. 

ఈదులనాగులపల్లిలో..
ఈదూలనాగులపల్లి, వెలమల శివారుల్లో రైల్వేట్రాక్‌ కారణంగా సర్వీసు రోడ్డును అంసపూర్తిగా వదిలేశారు. తాత్కాలికంగా మట్టి పోశారు. ఆ రోడ్డుపై నిత్యం ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. నాగులపల్లి రావాలంటే చాలా దూరం తిరిగాల్సిందే. గతంలో స్థానికులు ఆందోళన చేసినా హెచ్‌ఎండీఏ ఓఆర్‌ఆర్‌ విభాగ అధికారులు పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  

మేడ్చల్‌.. శంషాబాద్‌లో ఇలా..
కీసర నుంచి ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డులో పెద్ద అంబర్‌పేట్‌ వైపు వెళ్లాలంటే శ్రీనిధి ఇంజినీరింగ్‌ కళాశాల వరకు సర్వీస్‌ రోడ్డులో ప్రయాణించి అక్కడి నుంచి యంనంపేట్‌ గ్రామం నుంచి ఘట్‌కేసర్‌ బైపాస్‌ రోడ్డు కూడలి దాటి సర్వీస్‌ రోడ్డుకు చేరాలి. ఇక్కడా సర్వీస్‌ రోడ్డు నిర్మించక అదనంగా 3 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సిందే. పెద్ద అంబర్‌పేట్‌ నుంచి కీసర పోవాలంటే యంనంపేట్‌ గ్రామం మీదుగా సర్వీస్‌ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాలి. ఓఆర్‌ఆర తొండుపల్లి జంక్షన్‌ నుంచి పెద్దగోల్కొండ వైపు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఇరువైపులా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా ఉంది. ఉందానగర్‌–తిమ్మాపూర్‌ స్టేషన్ల రైల్వే ట్రాక్‌ ఉండడంతో సర్వీసు రోడ్డును అర్ధాంతరంగా నిలిపేశారు. అలాగే చెన్నమ్మ హోటల్‌ సమీపంలోని కొత్వాల్‌గూడ వద్దా రెండు కిలోమీటర్ల వరకు సర్వీసు రోడ్డు పనులు చేపట్టలేదు. దీంతో హిమాయత్‌సాగర్‌ వెంబడి ఉన్న ఇరుకు దారి గుండానే వెళ్లాల్సి వస్తోంది.

మరిన్ని వార్తలు