సంగీతం హాబీగా నేర్చుకున్నా...

12 Dec, 2013 01:13 IST|Sakshi
సంగీతం హాబీగా నేర్చుకున్నా...

సింహా చిత్రంలో ‘సింహమంటి చిన్నోడే..’, కెమెరామెన్ గంగతో రాంబాబులో ‘జర్రమెచ్చింది..’, తీన్‌మార్‌లో ‘అలేబాలే..’ అంటూ శ్రావణభార్గవి ఆలపించిన పలు పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. కుర్రకారు గుండెల్లో గుబులుపుట్టించాయి. గాయకురాలిగానే కాకుండా యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీరంగంలో దూసుకెళుతున్నారు ఆమె. ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొని పేరు తెచ్చుకున్న సహ గాయకుడు, సంగీత దర్శకుడు హేమచంద్రను ప్రేమ వివాహం చేసుకున్నారు. బుధవారం హనుమాన్ జంక్షన్ వచ్చిన శ్రావణభార్గవి కొద్దిసేపు...
 
న్యూస్‌లైన్ : మీ కుటుంబ నేపథ్యం ఏమిటీ?
భార్గవి : నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. నాన్న శివకుమార్ పోలీస్ శాఖలో ఏఎస్‌ఐగా పని చేస్తున్నారు. అమ్మ అరుణ గృహిణి.
 
న్యూ : శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారా?
భార్గవి : హైదరాబాద్ సిస్టర్స్‌లో ఒకరైన బి.లలిత గారి వద్ద ఐదేళ్ల పాటు కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. ఏదో హాబీగా నేర్చుకుందామని చేరిన తర్వాత సంగీతంపై ఆసక్తి పెరిగి గాయనిగా నిలదొక్కుకోవాలని నిశ్చయించుకున్నా.
 
న్యూ : మీరు పాట పాడిన తొలి చిత్రం ఏది.. ఇప్పటి వరకూ ఎన్ని సినిమాల్లో పాడారు?

భార్గవి : రమణ గోగుల సంగీత దర్శకత్వంలో 2009లో విడులైన ‘బోణి’ చిత్రంలో తొలి పాట పాడాను. ఇప్పటి వరకు దాదాపు 150 చిత్రాల్లో పాడాను. సింహా, తీన్‌మార్, కెమెరామెన్ గంగతో రాంబాబు, రాజన్న, దమ్ము తదితర చిత్రాల్లో పాడిన పాటలకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘రేయ్’ చిత్రం, రఘు కుంచె సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో చిత్రంలోని పాటలు పాడాను.
 
న్యూ : హేమచంద్రతో ప్రేమ ఎలా మొదలైంది?
భార్గవి : 2009లో రైడ్ సినిమాకు పాట పాడే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత తరుచూ మేసేజ్‌లు, ఫోన్ కాల్స్‌తో స్నేహం మరింత పెరిగింది. మూడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్నాం.

న్యూ : సినీ పరిశ్రమలో మీకు వచ్చిన  బెస్ట్ కాంప్లిమెంట్?
భార్గవి : పాపులర్ పాటను ఆలపించి సింగర్‌గా పేరు తెచ్చుకోవటం సాధారణ విషయమే... కానీ శ్రావణ భార్గవి పాటనే పాపులర్ చేసే సింగర్.. అంటూ ఇద్దరు, ముగ్గురు పరిశ్రమ పెద్దలు అభినందించటం మర్చిపోలేనిది.

మరిన్ని వార్తలు