అంతటా బెట్టింగుల హోరు !

18 May, 2019 14:19 IST|Sakshi

సాక్షి, గురజాల : మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగుల హోరు జోరుగా నడుస్తున్నాయి. రూ.కోట్లలో బెట్టింగ్‌లు పెట్టారని సమాచారం. గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు  ఫలితాలు వెలవడనున్నాయి. 2014 ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగింది. పెరిగిన ఓటింగ్‌ శాతం  ఎవరికి లబ్ధిచేకూరుతుందోనని  అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

ఎక్కడ విన్నా ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న చర్చే జరుగుతుంది. పోలింగ్‌ తర్వాత సుమారుగా నెల రోజులు పాటు స్తబ్ధత రాజ్యమేలింది. ఈ నెల 23వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియకు సమయం దగ్గర పడటంతో ఇటు రాజకీయ పక్షాలు, అటు ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

గత ఐదేళ్ల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని ప్రతి ఒక్కరు మార్పు కోరుకుంటున్నారని అన్ని సామాజిక వర్గాలు వైఎస్సార్‌ సీపీకి మొగ్గు చూపి ఓట్లు వేశారని తప్పనిసరిగా అధికారంలోకి వస్తామనే ధీమా వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తల్లో కనిపిస్తుంది. పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. 

చేతులు మారిన రూ.కోట్ల నగదు
పోలింగ్‌ పూర్తయిన తరువాత నియోజకవర్గంలో ఒక్కసారిగా బెట్టింగ్‌ బాబులు బరిలోకి దిగారు. వైఎస్సార్‌ సీపీ గెలుపు ఖాయమని కొందరు, టీడీపీ అధికారం ఖాయమని కొందరు ఈ విధంగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు బెట్టింగ్‌లు కాసినట్లు తెలిసింది. ప్రస్తుతం కౌంటింగ్‌ తేదీ సమీపించడంతో బెట్టింగ్‌ పెట్టిన వారిలో ఆందోళన మొదలైంది.

ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారో అని అలోచనలో ఉన్నారు. ఓటింగ్‌ జరిగిన మూడు రోజుల నుంచి వైఎస్సార్‌ సీపీ గెలుస్తుందని అధికంగా బెట్టింగ్‌లు వచ్చిన ఆ సమయంలో టీడీపీ నుండి బెట్టింగ్‌ పెట్టెందుకు  ఎవరూ ముందుకు రాకపోవడంపై పలువురు విశ్లేషకులు తప్పనిసరిగా వైఎస్సార్‌ సీపీ గెలుపు ఖాయమని చెబుతున్నారు. 

పల్లెల్లో వేడెక్కిన రాజకీయం...
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డ నాటి నుంచి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎండలు ముదరకముందే పోలింగ్‌ జరగ్గా ఓట్ల్ల లెక్కింపునకు సమయం ఎక్కువగా ఉండటంతో ఎండలు మండిపోతున్నా, రాజకీయ వాతావరణం కాస్త చల్లబడిందనే చెప్పాలి. లెక్కింపు గడువు సమీపిస్తుండటంతో మళ్లీ కొద్ది రోజుల నుంచి వాతావరణం వేడెక్కింది.

ఎన్నికల ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయోనని గ్రామస్థాయి నాయకుల నుంచి కార్యకర్తల వరకు చర్చించుకుంటున్నారు. ఏ గ్రామంలో ఏ వర్గం ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గు చూపారో అన్న అంశాలపై రచ్చబండల వద్ద రోజూ చర్చకు వస్తుండటంతో పల్లెలో వాతావరణం వేడెక్కింది.  ప్రజల తీర్పు  ఎటు ఉందో తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడక తప్పదు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు