పట్టుకో.. ఇచ్చుకో

20 Oct, 2014 02:32 IST|Sakshi
పట్టుకో.. ఇచ్చుకో

రాజంపేట
 వారే పట్టుకుంటారు.. వారే తరలిస్తారు ... ఇసుక వ్యవహారంలో రెవెన్యూ అధికారుల తీరు ఇది. అవసరమైన వారికి..అనుకూలమైన వారికి తక్కువ ధరలతో ఇసుకను  ఇచ్చివేయడం..కొన్ని సందర్భాలలో ఉచితంగా అందచేయడం కూడా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. స్ధానిక మన్నూరు పోలీసుస్టేషన్ ఆవరణంలో ఆదివారం పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లను ఉంచారు.

ఆ ఇసుకను మరో ట్రాక్టర్లలోకి తరలించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుకున్న ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుకను అక్రమంగా రవాణా చే స్తుంటే వేలవేలకు జరిమానాలు విధించి ..మళ్లీ అదే ఇసుకను ఇష్టమైన వారికి.. అవసరమైతే డబ్బులకు అమ్ముకోడం ఏ మాత్రం సబబు అని ట్రాక్టర్ల యజమానులు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన పక్షంలో జిల్లా కలెక్టరు విధించిన రేట్ల ప్రకారం స్థానిక తహశీల్దారు అనుమతి మేరకు ఇసుకను తరలిస్తున్నట్లు ఆర్డీఓ ప్రభాకర్‌పిళ్లై పేర్కొంటున్నారు.

 ఇసుకధరలకు రెక్కలు..
 రాజంపేట నియోజకవర్గంలో ఇసుక ధరలకు రెక్కలు వచ్చాయి. సామాన్యుడి నుంచి మధ్యతరగతి వారికి ఇంటి నిర్మాణం ఓ కలగానే మిగులుతోంది.  నిర్మాణ రంగానికి సంబంధించిన వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో గృహాలు నిర్మించుకోవాలంటే బెంబేలెత్తిపోతున్నారు. గతంలో ఇసుక ట్రాక్టరు రూ.700 నుంచి రూ.800 వరకు ధర పలికేది. ప్రస్తుతం ట్రాక్టరు ఇసుక రూ.  2,500 నుంచి రూ. 3000కు పెరిగిపోయింది. నియోజకవర్గంలోని చెయ్యేరు నదిలో ఇసుక ప్రధానంగా లభిస్తోంది.

ఇక్కడి నుంచే పెనగలూరు, నందలూరు, రాజంపేట మండలాల పరిధిలో ఇసుకను రవాణా చేయాల్సి ఉంటుంది. అధికారికంగా ఇసుక రవాణాకు అనుమతులు లేవు. రాత్రి వేళల్లో దొంగగా రవాణా చేసుకుంటూ అమ్మకాలు సాగించాల్సిందే.  అనేక  సందర్భాలలో అధికారులు పట్టుకుని వేలకువేలు  జరిమానాలు విధిస్తుండటంతో ఇసుకాసురులు జంకుతున్నారు. దీంతో ఇసుక లభ్యం ప్రశ్నార్థకరంగా మారింది. అయితే పోలీసులు, అధికారులకు ఇసుక అక్రమరవాణా కాసులు కురిపిస్తోందన్న విమర్ళలున్నాయి.

 వివాదంలో వేలం ఇసుక అప్పగింత
 ఆర్డీవో కార్యాలయంలో వేలంపాట ఇసుక అప్పగింత వివాదంలో చిక్కుకుంది. అధికారులు వేలందారుల నుంచి వేలకు వేలకు డబ్బులు  వసూలు చేశారు. కానీ ఇసుకను ఇవ్వడం లేదని వేలంపాటదారులు ఆరోపిస్తున్నారు. కొంత మొత్తానికి మాత్రమే ఇసుకను అప్పగిస్తున్నారు.  

ఈయేడాదిలో రెండునెలల క్రితం సీజ్ అయిన ఇసుకకు టెండర్లు పిలిచి నగదును డీడీ రూపంలో కట్టించుకున్నారు. వేలంపాటలో దక్కించుకున్న క్యూబిక్‌మీటర్ల ఇసుకను ఇవ్వని పరిస్ధితి. వీరంతా ఇప్పుడు రెవెన్యూశాఖ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు.
 
 భవననిర్మాణరంగం కుదేలు
 భవన నిర్మాణ రంగానికి ఇసుక చాలా కీలకం. అటువంటి ఇసుక దొరకడం కష్టమైన తరుణంలో ఆ రంగం ఇప్పుకు కుదేలవుతోంది. భవన నిర్మాణరంగానికి చెందిన కూలీలకు కూడా పనులు కూడా బాగా తగ్గిపోయాయి. రాజంపేట మున్సిపాలిటీలో అధికంగా గుత్తికి చెందిన వలసకూలీలు భవన నిర్మాణరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.

అలాంటి వారికి ఇప్పుడు పనులు లేని పరిస్ధితులు దాపురించాయి. ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇవ్వడంలో సర్కారు జాప్యం చేస్తోంది. సీఎం చంద్రబాబునాయుడు డ్వాక్రామహిళలకు ఇసుక రీచ్‌లు ఇస్తామని చెపుతున్నప్పటికీ అందులో కాలయాపన జరుగుతోంది. సవాలక్ష నిబంధనలు తెరపైకి వస్తున్నాయి. దీని వల్ల ఇసుక కొరత బాగా ఏర్పడుతోంది.

మరిన్ని వార్తలు