గృహయోగం

26 Aug, 2019 09:40 IST|Sakshi

ఇళ్ల లబ్ధిదారుల కోసం నేటినుంచి ఇంటింటి సర్వే

ఇప్పటికే వలంటీర్ల చేతికి సర్వే చేయాల్సిన ఇళ్ల జాబితా

వలంటీర్లు అర్హులని గుర్తించిన వారికే ఇళ్లు

30వ తేదీ నాటికి జిల్లా  ఉన్నతాధికారులకు జాబితా 

ప్రజాసంకల్పయాత్ర సాక్షిగా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఎంతోమంది నిరుపేదలను కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి కష్టాలు స్వయంగా చూశారు. వారందరికీ  ‘నేనున్నాను’ అంటూ భరోసా కల్పించారు. అధికారంలోకి  వచ్చాక నవరత్నాలతో వారి జీవితాలను మార్చేయాలని  సంకల్పించారు. అదే తమ మేనిఫెస్టో అని ప్రకటించారు. నిత్యం వాటిని గుర్తు చేసేలా ఆయన క్యాంప్‌ కార్యాలయంలో గోడలపై పెయింట్‌ చేయించారు. త్వరితగతిన వాటిని అమలు చేయాలని సంకల్పించారు. అందులో ముఖ్యమైన అంశం అందరికీ ఇళ్లు పథకం. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో సొంత ఇల్లు, ఇంటిస్థలం లేనివారు ఉండకూడదన్న లక్ష్యంతో  వచ్చే ఉగాది నాటికి తొలివిడతగా ఇంటిస్థలాలు, ఇళ్లు పంపిణీ  చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా వలంటీర్ల ద్వారా  లబ్ధిదారులను గుర్తించేందుకు ఆదేశాలు జారీ చేశారు.

సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా 2020 ఉగాది నాటికి అందరికీ ఇళ్లు ఇవ్వాలని సంకల్పించింది. దీనికి సంబంధించిన అర్హులను ఎంపిక చేసే బాధ్యత వలంటీర్లకు అప్పగించింది. వారు సోమవారం నుంచి సర్వే చేపట్టనున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో ఈ నెల 30వరకు ఈ సర్వే చేపడతారు. గ్రామాల్లో కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఆర్‌ఐల పర్యవేక్షణలో సర్వే చేస్తారు. ఇందుకోసం జిల్లాలోని 919 గ్రామ పంచాయతీల్లో గ్రామ పర్యవేక్షణాధికారులను నియమించారు.

సేకరించాల్సిన వివరాలు..
లబ్ధిదారుని వ్యక్తిగత వివరాలైన ఆధార్, కులం, వృత్తి, వయసు, సెల్‌ నంబరు వంటి ప్రాథమిక సమాచారంతో పాటు తెల్ల రేషన్‌ కార్డు ఉన్నదా... ఉంటే కార్డు సంఖ్య, రాష్ట్రంలో ఎక్కడైనా ఇల్లు ఉందా లేక ఇంటి స్థలం ఉందా, గతంలో ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన ఇల్లు, లేదా ఇంటి స్థలం కలిగి ఉన్నారా అన్నవి నమోదు చేస్తారు. 2.5 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూమి కలిగి ఉన్నట్టయినా... రాష్ట్రంలో ఎక్కడైనా ఇల్లు ఉన్నా నివేశన స్థలానికి అనర్హులు. ఈ వివరాల నమోదు అనంతరం ఆయన అర్హుడా కాదా అన్నది నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిస్తారు.

వలంటీర్ల కీలక బాధ్యతలు..
వలంటీర్లుగా ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 26 నుంచి ఇంటి స్థలం లేని వారు, స్థలం ఉండి ఇల్లు కట్టుకోనివారి వివరాలు నమోదు చేస్తారు. ప్రతి యాభై కుటుంబాల సంక్షేమ బాధ్యత, ప్రభుత్వ పథకాల పంపిణీ వీరిద్వారానే సాగుతుంది. వీరి పని తీరును పట్టణాల్లో కమిషనర్లు, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల అమలు ప్రక్రియ వలంటీర్ల వ్యవస్థ ద్వారానే చేపట్టనుంది. కుటుంబ సర్వే నివేదికను 30వ తేదీ నాటికి జిల్లా కేంద్రానికి అందేలా చర్యలు తీసుకుంటారు. నవరత్నాలలో భాగంగా 25 లక్షల ఇళ్లు ఇవ్వడమే ఈ సర్వే లక్ష్యం. లబ్ధిదారుల ఎంపికకు వార్డు వలంటీర్ల సర్వే ప్రాతిపదిక కానుంది. నివేశన స్థలానికి అర్హుడు అవునో కాదో వలంటీర్లే నిర్థారిస్తారు.

 సర్వేలో ఇంకేం వివరాలు సేకరిస్తారంటే..
-యజమాని వివరాలు, కుటుంబంలోని సభ్యు ల వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యుల ప్రాథమిక సమాచారాన్ని అందించాలి.
-గృహనిర్మాణం కింద సొంత ఇల్లు ఉందా. ఉం టే ఎవరి పేరున ఉంది. ఇంటికి తాగునీటి వసతి, మరుగుదొడ్డి ఉంటే వివరాలు, విద్యుత్‌ కనెక్షన్, నెలవారీ బిల్లు వివరాలు, వంట కట్టెలపొయ్యితోనా.. గ్యాస్‌తోనా అనే వివరాలు సేకరిస్తారు. 
-ఇంటి పరిసరాలు పరిశుభ్రత గురించి ఫార్మెట్‌లో వివరాలను పొందుపరచాలి. పరిశుభ్రత గు రించి తగిన సమాచారాన్ని వలంటీర్లు సేకరించాలి.
-వ్యవసాయ కుటుంబం అయితే ఎంత భూమి ఉంది. బ్యాంకు రుణం. కౌలు రైతు అయితే ఆ వివరాలు. వ్యవసాయ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు. రైతు తీసుకున్న అప్పుల వివరాలు ఇందులో పొందుపరచాలి. 
-పశుపోషణ వివరాలుంటే ఏ తరహా పశువులు ఎన్ని ఉన్నాయో నమోదు చేస్తా రు. వీటి ద్వారా ఆదాయం పొందుతుంటే వాటి వివరాలు. పశుపోషణలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో నమోదు చేస్తారు.
-ఆరోగ్యం అంశంలో పిల్లల ఆరోగ్యం వివరాలను నమోదు చేస్తారు. వారికి అందుతున్న పౌష్టికాహారాన్ని ఏ విధంగా పొందుతున్నారో సేకరిస్తారు. 
-విద్యకు సంబంధించి 6–15 ఏళ్ల వయస్సు ఉన్న వారు అభ్యసిస్తున్న విద్య వివరాలు. ఆ పై వయస్సున్న వారు చదువుతుంటే ఎక్కడ.. ఎలా చదువుతున్నారో వివరాలను నమోదు చేస్తారు. ప్రభుత్వ లబ్ధి పొందుతుంటే వాటి వివరాలను నమోదు చేయాలి.
-స్వయం సహాయ బృందాల మహిళలు కుటుంబంలో ఉంటే వారి వివరాలు, తీసుకున్న రుణం, ఇతర వివరాలను నమోదు చేస్తారు. పొదుపు సంఘాల సభ్యుల పని తీరును ఈ సర్వేలో నమోదు చేస్తారు.
-ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కింద లబ్ధి పొందుతుంటే పింఛన్, రేషన్, ఇతర పథకాల ద్వారా లబ్ధి వివరాలను సర్వేలో నమోదు చేస్తారు. కుటుంబ సంక్షేమంలో ఇతరత్రా ఎలాంటి సమస్య గుర్తించినా వాటిని ప్రత్యేకంగా సర్వేలో నమోదు చేస్తారు.

మీ ఇంటి వద్దకే వాలంటీర్లు..
వార్డు వలంటీర్లు ఈ నెల 26వ తేదీ నుంచి 30 వరకు వారికి నిర్దేశించిన గృహాలకు వస్తారు. నివాస స్థలాలు/గృహాల అర్జీలు వారికి ఇవ్వాలి. దీనికోసం స్పందన కార్యక్రమానికి రానక్కర లేదు. వలంటీర్లకు ఇళ్ల అర్జీలను ఇస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు దాఖలైన అర్జీలను వలంటీర్లు పరిశీలిస్తారు. ఇళ్ల అర్జీలు కూడా స్వీకరించి, మొత్తం వివరాలను అధికారులకు నివేదిస్తారు. 
– ఎస్‌.సచ్చిదానంద వర్మ, కమిషనర్,  నగరపాలక సంస్థ, విజయనగరం 

మరిన్ని వార్తలు