హోంగార్డు ఆత్మహత్య

27 Apr, 2016 00:31 IST|Sakshi

 శృంగవరపుకోట : స్థానిక అగ్నిమాపక శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శృంగవరపుకోటలోని మునసబు వీధిలో నివాసముంటున్న వసంత ఎరుకునాయుడు(28) అగ్నిమాపక శాఖ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఫైర్ ఆఫీసర్ రామచంద్రకు ఫోన్‌చేసి ‘సార్ నేను చనిపోతున్నా. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని చెప్పాడు. ఎక్కడున్నావని రామచంద్ర ప్రశ్నించడంతో పుణ్యగిరి కొండపై ఆశ్రమం వద్ద ఉన్నానని తెలిపాడు.
 
 వెంటనే ఇద్దరు ఫైర్‌మెన్లను పుణ్యగిరికి పంపగా, వారు ఎరుకునాయుడిని గుర్తించి సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు పంపారు. ఫైర్ సిబ్బంది సమాచారం మేరకు ఎస్‌ఐ రవికుమార్ వచ్చి ఎరుకునాయుడు వద్ద ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఎరుకునాయుడు మరణించాడు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. ఎరుకునాయుడుకు భార్య మణి, కుమార్తె సౌజన్య ఉన్నారు.
 
 మనశ్శాంతి లేక చనిపోతున్నా..
 తల్లి కాంత తనను తప్పుడుమార్గంలో పెంచిందని, తాగుడు నేర్పించిందని, తండ్రిని కొట్టించిందని మనశ్శాంతి లేక మరణిస్తున్నానని ఎరుకునాయుడు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తల్లి కాంత, మరో ముగ్గురు తనపై తప్పుడు కేసులు బనాయించి, గౌరవంగా బతకనీయకుండా చేస్తున్నారని, స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని, వారి వేధింపుల వల్లే చనిపోతున్నానని రాశాడు. తన కూతురిని చిన్నమామకు అప్పగించాలని, భార్యకు మరో పెళ్లి చేయాలని కోరాడు. ఆస్తిని తన తల్లి, భార్య, కుమార్తెకు సమానంగా పంచాలని పేర్కొన్నాడు. తన తండ్రి దహన సంస్కారాలకు ఎవరూ రాకపోవడం బాధించిందని రాశాడు. తన దహన సంస్కారాలకు బంధువులు, కుటుంబ సభ్యుల మొత్తం హాజరుకావాలని ఆ లేఖలో విన్నవించాడు.  
 

మరిన్ని వార్తలు