మద్యం ఎంతైనా తాగండి, కానీ.. : డిప్యూటీ సీఎం

15 Jul, 2018 07:46 IST|Sakshi

పెరవలి పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభ సభలో హోంమంత్రి చినరాజప్ప

పెరవలి: మద్యం ఎంతైనా తాగండి అది మీఇష్టం,  కానీ రోడ్డుపైకి వస్తే మాత్రం కేసులు పెడతాం  అని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెరవలిలో రూ.68 లక్షలతో నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని శనివారం ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ రాష్ట్రం లో శాంతి భద్రతలు సవ్యంగా ఉండాలంటే ఇటువంటి కేసులు తప్పవన్నారు. మద్యం తాగి వాహనాలు నడపటం వలన ప్రమాదాల బారిని పడుతున్నారని, వీటి నివారణ కోసమే పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు వంటివి నిర్వహిస్తున్నారన్నారు. వాహనదారులు తప్పని సరిగా హెల్మ్‌ట్‌ వాడాలని అది మీ రక్షణకేగానీ మా గురించి కాదన్నారు.  ఈ నాలుగేళ్లలో 40 పోలీస్‌ స్టేషన్‌లకు భ వనాలు నిర్మించామని, అందులో పెరవలి పోలీస్‌ స్టేషన్‌ ఒకటన్నారు.  నేరాలను అరికట్టేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, ఇది మంచి ఫలితాలను ఇస్తోందన్నారు.  యువత పెడదోవ పట్టటానికి సెల్‌ఫోన్‌లు కారణమని వారికి అవి అందకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదేన్నారు. 

జిల్లాకు పోలీసుల కొరత: మంత్రి పితాని
కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో పోలీసు సిబ్బంది తక్కువగా ఉన్నారని,  వెంటనే భర్తీ చేయాలని కోరారు. హోం మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రం మొత్తం మీద 6వేల పోస్టులు భర్తీ చేయగా అందులో జిల్లాకు 350 మందిని కేటాయించామన్నారు. అవసరమైతే మరింత మందిని పెంచుతామన్నారు. 

ఇంటికి తీసుకెళ్లి తాగండి : మంత్రి జవహర్‌
ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్‌ షాపులు లేకుండా చేశామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దన్నారు. మద్యం తాగొద్దని తాము చెప్పబోమని, ఇంటికి తీసుకెళ్లి తాగాలని చూచించారు. ఎమ్మెల్యే  బూరుగుపల్లి శేషారావు ప్రసంగించారు. పోలీస్‌ స్టేషన్‌ ఆ వరణలో మొక్కలు నాటారు. మంత్రులు రాజప్ప, పితాని, జవహర్, ఎస్పీ రవిప్రకాశ్‌లను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ భూపతిరాజు రవివర్మ, డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరావు, సీఐ అప్పలస్వామి, ఎస్సై పి. నాగరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు అతికాల కుసుమాంజలిరమ్యశ్రీ, ఎంపీపీ నల్లి శిరీష, సర్పంచ్‌ సలాది సత్యవతి, ఎంపీటీసీ సభ్యురాలు ఆగిర్తి స్వరూపారాణి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు