ప్రభుత్వం మహిళల భద్రతకు కట్టుబడి ఉంది : సుచరిత

26 Jul, 2019 13:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: సైబర్‌ నేరాలు, మహిళల భద్రత విషయంలో అవగాహన కల్పించేందుకు శుక్రవారం సచివాలయంలో ‘సైబర్‌ నేరాల నుంచి మహిళలకు రక్షణ’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక మంచి, చెడు సెకన్ల వ్యవధిలో ఒకరి నుంచి ఒకరికి చేరిపోతున్నాయన్నారు. పెరిగిపోతున్న సైబర్‌ నేరగాళ్ల సంఖ్య ఆందోళన కలిగిస్తుందన్నారు.

స్మార్ట్‌ ఫోన్‌ మన వద్దనే ఉన్నా.. సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరుతుందని తెలిపారు సుచరిత. సెల్‌ఫోన్‌ రిపేర్‌ కేంద్రాల నిర్వాహకులు రిపేర్‌కు వచ్చిన ఫోన్‌లలో స్పై యాప్‌లు పెడుతున్నారని పేర్కొన్నారు. ఫలితంగా మహిళల వ్యక్తిగత సమాచారం క్షణాల్లో సైబర్‌ నేరగాళ్లకు చేరుతుందని తెలిపారు. ఫొటోలు మార్ఫింగ్ చేయడం సహా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఫేస్‌బుక్‌, ఇతర మాధ్యమాల్లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టి స్నేహం చేసి మోసాలు చేస్తున్నారని హెచ్చరించారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని సుచరిత కోరారు.

సైబర్ నేరాల నుంచి మహిళల రక్షణకు ఇంకా ఏం చేయాలనే అంశంపై చర్చించడమే సమావేశం ముఖ్య ఉద్దేశం అన్నారు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు. రాష్ట్రానికి మహిళ  హోం మంత్రిని నియమించి.. మహిళల రక్షణకు తాము ఇస్తోన్న ప్రాధాన్యత తెలియజేశారన్నారు. రానున్న రోజుల్లో సైబర్ నేరాల నుంచి మహిళల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.  మహిళల భద్రత విషయంలో చాలా సవాళ్లు ఉన్నాయన్నారు. పోలీసు స్టేషన్ల వరకు రాకుండానే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు