త్వరలోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తాం : హోంమంత్రి

12 Sep, 2019 13:03 IST|Sakshi

సాక్షి,అమరావతి : పోలీస్‌శాఖలోని సివిల్‌, ఏఆర్‌, ఏపీఎస్పీ, జైలు వార్డన్స్‌ కానిస్టేబుళ్ల ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. మొత్తం 2623 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవగా, అందులో 500 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం త్వరలోనే భారీ రిక్రూట్‌మెంట్‌ చేపట్టి పోలీస్‌ శాఖలో ఉన్న ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్‌శాఖలో అమలు చేస్తున్న వీక్లీఆఫ్‌ వలన కొత్తగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించామని తెలిపారు.

ఎస్సై ఫిర్యాదు చేస్తే చర్యలు
పల్నాడు ఘటనపై స్పందించిన సుచరిత... టీడీపీ స్వార్థ రాజకీయాలు పల్నాడులో పని చేయలేదని విమర్శించారు. టీడీపీ చేపట్టదలిచిన 'చలో ఆత్మకూరు'లో పెయిడ్‌ ఆర్టిస్ట్‌లు ఉన్నారు కాబట్టే వాళ్ల శిబిరం నుంచి కార్యకర్తలు వెళ్లిపోయారని మండిపడ్డారు. దళితుల పట్ల అమితమైన ప్రేమ కురిపిస్తోన్న చంద్రబాబు వారి ప్రభుత్వ హయాంలో ఐపీఎస్‌ అధికారిణి వనజాక్షిపై జరిగిన దాడిపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా ఎస్సైగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తోన్న మహిళను నన్నపనేని రాజకుమారి కులం పేరుతో ధూషించడం తగదని హెచ్చరించారు. ఎస్సై ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. దళితులను అవమానిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సుచరిత పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు