ప్రశాంతంగా ఉంటే బాబుకు నచ్చడం లేదు: సుచరిత

9 Sep, 2019 17:33 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమం జరగుతోందని... ఫిర్యాదులకు 15 రోజుల్లో పరిష్కారం చూపించాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. వర్షాలు పడి రైతులు, రైతు కూలీలు పనుల్లో నిమగ్నమై.. నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాస్తూ రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంటే చంద్రబాబుకు నచ్చడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే పల్నాడులో పెయిడ్‌ ఆర్టిస్టులతో శిబిరాలు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ గౌతం సవాంగ్‌తో కలిసి సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా...2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని హోం మంత్రి సుచరిత విమర్శించారు. టీడీపీ నేత యరపతినేని అక్రమ మైనింగ్‌ గురించి ఫిర్యాదు చేసినందుకు గురువాచారి అనే వ్యక్తిని దారుణంగా హింసించారన్నారు. టీడీపీ పాలనలో గురువాచారిని చిత్ర హింసలకు గురిచేశారని.. ఆయన ఫొటోలను మీడియా ముఖంగా చూపించారు. అదే విధంగా యరపతినేని ఓ వ్యక్తిని కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని... ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారన్నారు. చంద్రబాబు పాలనలో ఇలాంటి మరెన్నో కేసులు నమోదయ్యాయని హోం మంత్రి తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి భయానక పరిస్థితులు లేవని, నేరాలు తగ్గి శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు.ఇటువంటి సమయంలో చంద్రబాబు పెయిడ్‌ ఆర్టిస్టులను తీసుకొచ్చి గ్రామాల్లో తమను ఉండనివ్వడం లేదంటూ పునారావాస శిబిరాలు పెడుతున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో ఎలాంటి ఘోరాలు జరిగాయో ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. 

‘పిచ్చి కుక్కను రాయితో కొడితే కేసు పెట్టారు. టీడీపీలో లేని వాళ్లపై అక్రమ కేసులు బనాయించారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు తప్పు చేసిన వారిని ఉపేక్షించకూడదని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. కానీ చంద్రబాబు వంటి సీనియర్‌ నాయకులు పోలీసు వ్యవస్థ చిన్నబుచ్చుకునేలా.. వాళ్లు ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ విమర్శించడం తగదు. గురజాల ప్రశాంతంగా ఉంది. నిజమైన బాధితులకు తప్పకుండా రక్షణ కల్పిస్తాం. అధికారులు వెళ్లి పరిస్థితులు గమనించి నిజంగా బాధితులు ఉంటే వారిని పోలీసు రక్షణతో గ్రామాల్లోకి తీసుకువెళ్తారు. నిజానికి ఎన్నికలు ముగిసిన తర్వాత పల్నాడులో 79 రాజకీయ కేసులు నమోదయ్యాయి. వాటిలో 43 టీడీపీ, 36 వైఎస్సార్‌ సీపీ చేశాయి’ అని హోం మంత్రి సుచరిత తెలిపారు. ఇక డీజీపీ గౌతం సవాంగ్‌ మాట్లాడుతూ.. పల్నాడులో 144 సెక్షన్ విధించామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఛలో ఆత్మకూరు కోసం ఎవరూ ఎటువంటి అనుమతి అడగలేదని తెలిపారు.

మరిన్ని వార్తలు