కత్తి కట్టి.. పందెం పట్టి..

17 Jan, 2015 01:15 IST|Sakshi
కత్తి కట్టి.. పందెం పట్టి..

రేపల్లె :అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల సాక్షిగా సంప్రదాయం మాటున కోడి పందేలు జోరుగా సాగాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి. పోలీసులు మౌనం దాల్చడంతో పందెంరాయుళ్లు బహిరంగంగా ‘బరి’లోకి దిగారు. సంక్రాంతి సందర్భంగా రేపల్లె మండలం గుడ్డికాయలంక గ్రామంలో ఏర్పాటు చేసిన కోడిపందేలు మూడవ రోజు శుక్రవారం భారీ స్థాయిలో జరిగాయి. ఈ మూడురోజుల్లో సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు చేతులు మారగా, వందలాది పుంజులు నెత్తుటిధారలతో నేలకొరిగాయి.
 
గుంటూరు జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్కనే ఉన్న కృష్ణా జిల్లా తీరప్రాంత మండలాల నుంచి పందెంరాయుళ్లు పెద్ద సంఖ్యలో ఇక్కడకు చేరుకోవడంతో గుడ్డికాయలంక గ్రామం కిక్కిరిసిపోయింది. జూదరులు అనూహ్యంగా తరలిరావడంతో పందేలు కూడా అదే స్థాయిలో జరిగాయి.
 
అధికారపార్టీ ప్రజాప్రతినిధులే బరివద్ద నిలవడంతో పోలీసులు ఇటువైపు చూసే సాహసం చేయలేకపోయారు. బహిరంగంగానే కోడి పుంజులకు కత్తులుకట్టి ఒక్కొక్క జతపై లక్షలాది రూపాయల పందేలు కాస్తూ జూదరులు విజృంభించిన తీరు చట్టానికి తూట్లు పొడిచినట్టయింది. ఇదే సమయంలో పేకాటలో కోతముక్క, ఇతర డబ్బా, చక్రం వంటి జూదాలను యథేచ్ఛగా ఆడారు.
 
అధికార పార్టీకి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోడి పందేలను తొలిరోజు బుధవారం ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, రెండవ రోజు గురువారం రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు.
 
డీసీసీబీ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు తొలిరోజు నుంచీ బరి వద్దనే ఉంటూ జూదరులను ప్రోత్సహించే యత్నం చేశారు. ప్రజాప్రతినిధులు, మంత్రి పందేల్లో పాల్గొనటంతో పందెంరాయుళ్లు మరింత చెలరేగిపోయారు.
 
ఇదిలావుండగా, సంప్రదాయం మాటున నిర్వహించిన కోడి పందేల కారణంగా వందలాది మంది ఆర్థికంగా నష్టపోయారు. గ్రామీణ ప్రాంతంలో పంటలు పుష్కలంగా పండి పచ్చగా ఉన్న తరుణంలో కోడి పందేలు   నిర్వహించడంవల్ల ఆర్థిక స్థితిగతులు తల్లకిందులవుతున్నాయని ఈ సందర్భంగా పలు మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

మరిన్ని వార్తలు