అయ్యో...హోమియో

17 Mar, 2017 09:10 IST|Sakshi
ప్రభుత్వ హోమియో వైద్య విభాగాల్లో వైద్యుల కొరత వెంటాడుతోంది. 2008లో అప్పటి ప్రభుత్వం రాష్ట్రంలో 557 హోమియో వైద్య విభాగాలను ఏర్పాటు చేసింది. వీటిలో పని  చేసేందుకు 1114మంది పారామెడికల్‌ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించింది. నేషనల్‌ రూరల్‌ హెల్త్‌మిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్యాధికారులను కొంత మందిని 2011లో జీవో నంబర్‌ 254 ప్రకారం 449 మందిని ప్రభుత్వం వైద్యులుగా రెగ్యులర్‌ చేసింది. తర్వాత వీరిని వేరే విభాగాలకు బదిలీ చేయడంతో వెద్యులు కొరత ఏర్పడింది. అప్పటి నుంచి కాంపౌండర్, ఎస్‌ఎంవోలే రోగులకు వైద్యం అందిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 557 వైద్యశాలలకు 136 మంది మాత్రమే డాక్టర్లు ఉన్నారు. 
కృష్ణాజిల్లాలో 48 విభాగాలకు  ఎనిమిది మందే సేవలందిస్తున్నారు. 
► డాక్టర్ల కొరతతో హోమియో వైద్యశాలలు వెలవెల
► కాంపౌండర్లతోనే వైద్య సేవలు 48 విభాగాలకు 
► ఎనిమిది మందే వైద్యులు 
జి.కొండూరు (మైలవరం) :  ప్రభుత్వం హోమియో వైద్యశాలలపై చిన్న చూపు చూస్తోంది. సిబ్బందికి జీతాలు, సరైన మందులను అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలకు మెరుగైన హోమియో వైద్యం అందుబాటులోకి తేవాలని ఉద్దేశంతో 2008లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హోమియో విభాగాలను ప్రారంభించింది. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోమియో వైద్యాన్ని సామాన్యులకు అందకుండా చేస్తుంది. ఇప్పుడిప్పుడే హోమియో వైద్యానికి అలవాటు పడుతున్న రోగులు డాక్టర్ల కొరత, సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.
 
వేతనాలు లేవు
ప్రభుత్వ హోమియో వైద్య విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి 11 నెలలుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వడంలేదు. డాక్టర్లు ఉన్న విభాగాల్లో మాత్రమే వేతనాలు ఇస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 11 నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు. ఈ విషయమై వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఎన్నిసార్లు కలిసి వినతిపత్రాలు అందజేసినా ఉపయోగంలేదని ఆవేదన చెందుతున్నారు. 
 
అందుబాటులో లేని మందులు
హోమియో విభాగాల్లో డాక్టర్ల కొరతతో పాటు మందులు కూడా అందుబాటులో ఉండడంలేదు. ప్రభుత్వం హోమియో విభాగాలకు అన్నిరకాల మందులను సరఫరా చేయడం లేదు. సరైన వైద్యం,మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు హోమిమో వైద్యానికి దూరమవుతున్నారు. 
 
11 నెలలుగా జీతాలు లేవు
11 నెలలుగా జీతాలు రావడంలేదు. కుటుంబ పోషణ కష్టంగా మారింది. ప్రభుత్వం వెంటనే జీతాలు ఇవ్వాలి. కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యలర్‌ చేయడంతోపాటు వైద్యులను నియమించాలి. 
–శ్రీనివాసరావు, 
హోమియో వైద్య విభాగం ఎస్‌ఎన్వో
మరిన్ని వార్తలు