హిజ్రాలపై చిన్నచూపు తగదు

29 Jan, 2014 02:26 IST|Sakshi
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్:హిజ్రాలపై చిన్నచూపు తగదని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యు డు బి.ఎల్.నర్సింగరావు అన్నారు. మంగళవారం ఎన్‌సీఎస్ రోడ్డులో ఒక ఫంక్షన్ హాలులో హిజ్రాలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ప్రధా న వక్తగా నర్సింగరావు మాట్లాడుతూ సమాజంలో హిజ్రాలను చిన్న చూపు చూడడం, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వారిని అనుచితంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని చెప్పారు. అటువంటి సంఘటనలు తమ దృష్టికి తీసుకువస్తే తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
 
 సమాజంలో స్త్రీ, పురుషులతో సమానంగా హిజ్రాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు హిజ్రాలకు సరైన ఆదరణ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో స్త్రీ, పురుషులతో సమానంగా గుర్తిస్తూ ప్రభుత్వం ఓటరు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇతర సంక్షేమ పథకాల అమలులో తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. హెల్పింగ్ హేండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండబాబు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఎక్కువ మంది హిజ్రాలున్నారని, వారికి స్వయం ఉపాధి కల్పించాలన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో  మాదిరి గా ఇక్కడ కూడా  హిజ్రాల దినోత్సవాన్ని  నిర్వహించాలని కోరారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు హరీష్ రావు, రాజు, వన్‌టౌన్ ఎస్‌ఐ రమణయ్య, హిజ్రాస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలు కుమారమ్మ, అధ్యక్షురాలు దవడ మీన, కార్యదర్శి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
 
 పెద్ద చెరువు గట్టుపై ప్రత్యేక పూజలు  
 పెద్ద చెరువు గట్టుపై నవదుర్గా ఆలయ నిర్మాణ పనులు విజయవంతం జరగాలని  హిజ్రాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు కంటోన్మెంట్ నుంచి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండబాబు మాట్లాడుతూ  నవదుర్గ ఆలయాన్ని  జూన్ 20వ తేదీలోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి విశాఖ జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామానికి చెందిన ఇటుక గ్రామస్థులు  ఉచితంగా ఇటుకలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.నవదుర్గ విగ్రహాలను నాయుడు ఫంక్షన్ హాల్ అధినేత, ఆయన స్నేహితులు విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు.
 
మరిన్ని వార్తలు