ఆటో డ్రైవర్ నిజాయితీ..

7 Apr, 2014 00:32 IST|Sakshi
ఆటో డ్రైవర్ నిజాయితీ..

ప్రయాణికుడి నగల బ్యాగును తిరిగి ఇచ్చిన వైనం
 కల్లూరు, న్యూస్‌లైన్: తన ఆటోలో ప్రయాణికుడు మర్చిపోయిన రెండులక్షల రూపాయల విలువైన నగల బ్యాగును ఆటో డ్రైవర్ భద్రపరిచి తిరిగి ఇచ్చేయగా అందరూ అభినందించారు. వివరాలు.. ఖమ్మం నగరానికి చెందిన తవిడిశెట్టి రాఘవరావు.. బంధువుల వివాహం కోసం కృష్ణా జిల్లా తిరువూరు వెళ్లేందుకు ఖమ్మంలో ఆర్టీసీ బస్సు ఎక్కి కల్లూరులో దిగాడు.
 
 అక్కడి నుంచి తిరువూరు వెళ్ళేందుకు బస్సు లేకపోవడంతో ఆటో (డ్రైవర్ పేరు దాసరి తిరుపతిరావు) ఎక్కి కూర్చున్నాడు. అది బయల్దేరడం ఆలస్యమవుతుందని గ్రహించి.. హడావుడిగా దిగేసి మరో ఆటో ఎక్కాడు. కొద్ది దూరం వెళ్లాక, తన బ్యాగును మొదట ఎక్కిన ఆటోలోనే మరిచిపోయిన విషయం గుర్తుకొచ్చింది. అతడు వెంటనే ఆటో దిగి, కల్లూరులోని పరిచయస్తులకు ఫోన్ చేసి విషయం చెప్పి, ఆటో డ్రైవర్ ఆనవాళ్లు చెప్పాడు.
 
 ఏమాత్రం ఆలస్యం చేయకుండా తాను కూడా మరో ఆటోలో కల్లూరుకు చేరుకున్నాడు. థ్యాంక్ గాడ్.. నగలతో కూడిన ఆ బ్యాగు క్షేమంగానే ఉంది...! దానిని ఆటో డ్రైవర్ దాసరి తిరుపతిరావు గమనించి, తిరిగి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే స్వంతదారుడు రావడంతో.. ఆటో యూనియన్ అధ్యక్షుడు ఖమ్మంపాటి శ్రీనివాసరావు, కోశాధికారి ముజీమ్ సమక్షంలో ఆయనకు ఆ బ్యాగును అందజేశాడు. ఈ విషయం తెలుసుకున్న సాటి డ్రైవర్లు, స్థానికులు... నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచావంటూ దాసరి తిరుపతిరావును మనసారా అభినందించారు.
 

మరిన్ని వార్తలు