మనసున్న కన్నయ్య !

21 Sep, 2014 12:36 IST|Sakshi
బాధితులకు కన్నయ్య చేతులు మీదుగా నగదు అందచేస్తున్న ఎస్‌ఐ

చిత్తూరు: రోడ్డుపై వంద రూపాయల నోటు కనిపిస్తే.. ఎవరూ చూడకముందే గభాలున జేబులో వేసుకునే రోజులివి. అలాంటిది ఏకంగా రూ.5 లక్షల నగదు దొరికితే.. మనదికానిది అర్ధరూపాయైనా అవసరం లేదనుకున్నాడో ఆర్టీసీ ఉద్యోగి. బస్టాండ్లో దొరికిన రూ.5 లక్షలను పోగొట్టుకున్నవారికే అందజేశాడు.

చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన శ్రీనివాసులురెడ్డి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అతడికి ఇచ్చేందుకు శనివారం రూ.5 లక్షల నగదుతో బయలుదేరిన అతడి తల్లి నవనీతమ్మ నగదు బ్యాగ్‌ను చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో మరిచిపోయి బెంగళూరు బస్సు ఎక్కి వెళ్లిపోయారు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న చిత్తూరు ఆర్టీసీ టూ డిపో కంట్రోలర్ కన్నయ్య ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సంచిని చూసి అందులో రూ.5 లక్షల నగదు, సెల్‌ఫోన్ ఉన్నాయని గుర్తించి అధికారులకు అందజేశారు.

ఇంతలో బస్సు జాగ్రత్తగా ఎక్కారో లేదో తెలుసుకోవడానికి నవనీతమ్మకు ఆమె ఇంట్లో పనిచేస్తున్న కవిత ఫోన్ చేసింది. నగదు బ్యాగ్‌లో ఉన్న ఆ ఫోన్‌ను రిసీవ్ చేసుకున్న కన్నయ్య... కవితను వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు పిలింపించారు. ఎస్‌ఐ కృష్ణయ్య సమక్షంలో రూ.5 లక్షలు, సెల్‌ఫోన్ ఆమె చేతికి అందచేశారు. పోలీసులు ఈ విషయాన్ని శ్రీనివాసులురెడ్డికి ఫోన్‌లో తెలియజేశారు. కన్నయ్యను పోలీసులు, ఆర్టీసీ అధికారులు ప్రశంసించారు. కన్నయ్య నిజాయితీకి అవార్డు ఇప్పిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు