ముసుగు తీస్తే.. ముట్టడే

16 Apr, 2019 11:36 IST|Sakshi
ముఖానికి గుడ్డలు కట్టుకుని బంకుకు వచ్చిన వినియోగదారులు, రగ్గులు కప్పుకుని పెట్రోల్‌ పోస్తున్న పెదబయలు బంకు సిబ్బంది

తేనెటీగల జోరుకు రగ్గు మంత్రం

పెట్రోల్‌ వాసనకు బంకు సిబ్బందిపై దాడి

వినియోగదారులపైనా..

పట్టించుకోని జీసీసీ అధికారులు

విశాఖపట్నం, పెదబయలు(అరకులోయ): ఒళ్లంతా రగ్గుకప్పుకుని పెట్రోల్‌ పోస్తున్నది చలికి వణికిపోతూ కాదు..ముఖానికి గుడ్డలు కట్టుకుని వచ్చి బంకులో పెట్రోల్‌ పోయించుకుంటున్నదీ చెవులకు చలిగాలి సోకుతుందనీ కాదు.. పరిసరాల్లోని చెట్లకు ఉన్న తుట్టెల నుంచి తేనెటీగలు దాడి చేస్తాయన్న భయంతోనే..పెదబయలులోని జీసీసీ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఈ దుస్థితి నెలకొంది. రోజుల తరబడి ఇదే దుస్థితి కొనసాగుతోంది. జీసీసీ, ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ పెట్రోల్‌ బంకు నిర్వహిస్తున్నారు.

వాహనాల్లోకి పెట్రలో పోస్తున్నప్పుడల్లా ఆ వాసనకు తేనెటీగలు చెలరేగిపోతున్నాయి. వడగాడ్పులకు దూసుకొస్తున్నాయి. బంకు సిబ్బంది, వినియోగదారులపై దాడి చేస్తున్నాయి.  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇదే దుస్థితి అని, ఇప్పటికి పది పదిహేనుసార్లు వాటి దాడికి గురయ్యామని సిబ్బంది చెబుతున్నారు. ప్రారంభంలో అటవీశాఖ, జీసీసీ అధికారులకు వివరించామని, నెలన్నరగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా..ఎవ్వరూ పట్టించుకోలేదని అంటున్నారు. చెట్లకు ఉన్న తేనె తుట్టెలను తీయించే ప్రయత్నం చేయలేదంటున్నారు. రోజూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నామంటున్నారు. తేనెటీగల దాడికి గురికాకుండా ప్రత్యేకంగా దుస్తులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే విధులు బహిష్కరిస్తామని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు