నిరుద్యోగులకు కుచ్చుటోపి

28 Jun, 2016 00:24 IST|Sakshi

హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ జిల్లాలోని పలు మండలాలకు చెందిన నిరుద్యోగులకు హైదరాబాద్‌కు చెందిన ఓ ఏఆర్ కానిస్టేబుల్ కుచ్చుటోపి పెట్టాడు. ఒక్కొక్క నిరుద్యోగ అభ్యర్థి నుంచి రూ. 1.70 లక్షలు నుంచి రూ. 2 లక్షలు చొప్పున సుమారు రూ. 60 లక్షలు వరకు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశాడు. లావేరు మండలంలోని పోతయ్యవలస గ్రామానికి చెందిన కొంపెల్ల నరేష్ అనే యువకుడు దీనిపై లావేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి బాధిత నిరుద్యోగులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
 
 లావేరు: హైదరాబాద్‌లోని అడిషనల్ డీజీపీ కార్యాలయంలో పీటీవో సెక్షన్‌లో ఏఆర్ కానిస్టేబుల్ కమ్ డ్రైవర్‌గా మధు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇతడు ఏలూరు ప్రాంతానికి చెందిన వాడు. తనకు అడిషనల్ డీజీపీ కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో మంచి పరిచయాలు ఉన్నాయని, హోంగార్డు ఉద్యోగాలు ఈజీగా వేయించగలని తనకు తెలిసిన వారితో చెప్పాడు. ఒక్కొక్క ఉద్యోగానికి రూ. 2 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపాడు.
 
 
  ఇదే విషయాన్ని ఏఆర్ కానిస్టేబుల్‌తో పరిచయం ఉన్న వ్యక్తులు తమకు తెలిసిన లావేరు మండలంలోని పోతయ్యవలస, లింగాలవలస, భామిని మండలంలోని బాలేరు, కొత్తూరు మండలంలోని ఇరపాడు, పాలకొండ మండలంలోని పాలకొండ గ్రామాలకు చెందిన కొందరు నిరుద్యోగ యువకులకు చెప్పారు. వారంతా హోంగార్డు ఉద్యోగాల కోసం రూ. 2 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించుకొన్నారు. ముందుగా రూ. 1.30 లక్షలు నుంచి రూ. 1.70 లక్షలు చొప్పున ఏఆర్ కానిస్టేబుల్ మధుకు 2012 డిసెంబరులో హైదరాబాద్‌లోని లక్డీకపూల్ ప్రాంతంలో అందజేశారు.
 
  డబ్బులు ఇచ్చిన తర్వాత సంవత్సరాలు గడచినా హోంగార్డు ఉద్యోగాలు రాకపోవడంతో అతనిని నిరుద్యోగ యువకులు ప్రశ్నిస్తే ఇదిగో అదిగో జాయినింగ్ ఆర్డర్లు రెడీ అవుతున్నాయంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి తప్పించుకుని తిరిగేవాడు. మధు చేసిన మోసంపై లావేరు మండలంలోని పోతయ్యవలస గ్రామానికి చెందిన కొంపెల్ల నరేష్ అనే వ్యక్తి ఇటీవల లావేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
 పోలీసుల అదుపులో మధు?
 నరేష్ ఫిర్యాదు మేరకు లావేరు పోలీసులు హైదరాబాద్ వెళ్లి మధును పట్టుకొని ఆదివారం రాత్రి స్థానిక స్టేషన్‌కు తీసుకువచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం లావేరు పోలీసుల అదుపులో మధు ఉన్నట్టు సమాచారం. మధును తీసుకువచ్చిన విషయం తెలుసుకున్న లావేరు, భామిని, పాలకొండ, కొత్తూరు మండలాలకు చెందిన బాధిత నిరుద్యోగులు సోమవారం లావేరు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తమను మధు ఏవిధంగా మోసం చేశాడో వారంతా పోలీసులు, విలేకరులకు తెలిపారు. వీరే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మరికొంత మంది నిరుద్యోగులు వద్ద నుంచి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని మధు డబ్బులు తీసుకున్నట్టు తెలిసింది.

 

మరిన్ని వార్తలు