వీవోఏ, ఆర్పీల గౌరవ వేతనం 10,000

12 Nov, 2019 03:15 IST|Sakshi
గౌరవ వేతనం భారీగా పెంచినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ గుంటూరులో ర్యాలీ చేస్తున్న వీవోఏలు

డిసెంబర్‌ నుంచి అమలు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

గ్రామీణ, పట్టణాల్లో దాదాపు 36,000 మందికి ప్రయోజనం

గతంలో గౌరవ వేతనాన్ని రద్దు చేసిన చంద్రబాబు సర్కారు

వైఎస్‌ జగన్‌ ప్రకటనతో ఎన్నికల ముందు బాబు గిమ్మిక్కులు

సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల కార్యకలాపాల్లో అట్టడుగు స్థాయిలో పనిచేసే గ్రామ సంఘ సహాయకురాలు (వీవోఏ), పట్టణ రిసోర్స్‌ పర్సన్‌(ఆర్‌పీ)లకు ప్రతి నెలా చెల్లించే గౌరవ వేతనాన్ని రూ.10,000కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 1వ తేదీ నుంచి గౌరవ వేతనాల పెంపు నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది. పొదుపు సంఘాల సభ్యుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడంతో ఆర్థిక లావాదేవీలు, నెలవారీ సమావేశాల తీర్మానాలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయడం, బ్యాంకు అధికారులతో మాట్లాడి పొదుపు సంఘాలకు రుణాలు ఇప్పించడం లాంటి కీలక పనులను వీవోఏ, ఆర్పీలు నిర్వహిస్తుంటారు. వీవోఏలను గతంలో యానిమేటర్లు, సంఘమిత్రలు అని పిలిచేవారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 27,797 గ్రామ సమాఖ్యలు, పట్టణ ప్రాంతాల్లో 8,034 ఎస్‌ఎల్‌ఎఫ్, టీఎల్‌ఎఫ్‌లున్నాయి. గ్రామ సమాఖ్య పరిధిలో ఉండే సంఘాల వ్యవహారాలను 35,831 మంది వీవోఏలు, ఆర్పీలు పర్యవేక్షిస్తున్నారు. 

నాడు గౌరవ వేతనాన్ని రద్దు చేసిన చంద్రబాబు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సెర్ప్‌లో పనిచేసే వీవోఏలకు ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.2 వేల చొప్పున చెల్లించే గౌరవ వేతనాన్ని 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రద్దు చేశారు. గౌరవ వేతనం నిలిపివేస్తున్నట్టు వారికి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. 27 వేల మందికిపైగా వీవోఏలు 2015లో ఏకంగా 75 రోజుల పాటు సమ్మె చేసినా కరుణించలేదు. అసలు వీవోఏలు ప్రభుత్వ ఉద్యోగులే కాదని, రూపాయి కూడా గౌరవ వేతనం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే 2019 ఎన్నికలు రావడం, నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసాతో అప్రమత్తమైన గత సర్కారు వీవోఏలకు ప్రభుత్వం నుంచి రూ.3 వేలు, గ్రామ సమాఖ్య నుంచి మరో రెండు వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని అధికారం కోల్పోయే సమయంలో గత్యంతరం లేక హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్పీలకు నామమాత్రంగా గౌరవ వేతనం చెల్లించేందుకు అంగీకరించింది.

వారి కష్టాలు స్వయంగా చూసి..
ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా 2018 జూలై 15న తూర్పు గోదావరి జిల్లాలో తనను కలిసిన వీవోఏ, ఆర్పీలకు వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే రూ.పది వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే 27,797 మంది వీవోఏలకు నెలకు రూ.10 వేలు (ప్రభుత్వం నుంచి రూ.8 వేలు + గ్రామ సమాఖ్య నిధుల నుంచి రూ.2 వేలు) చొప్పున చెల్లించేలా గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అదే తరహాలో పట్టణ ప్రాంతాల్లో పనిచేసే 8,034 మంది ఆర్పీలకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించేలా పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్యామలరావు వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.  

మా జీవితాల్లో నిజమైన వెలుగు.. 
‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం యానిమేటర్లకు నెలకు రూ.10 వేలు చొప్పున వేతనాన్ని పెంచడంతో మా జీవితాల్లో నిజమైన వెలుగు వచ్చింది. 2003 నుంచి పనిచేస్తున్న మాకు గత ప్రభుత్వం ఏ సాయం చేయలేదు. మా కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి మొదటి కేబినెట్‌లోనే మా గురించి ఆలోచించి హామీని అమలు చేయడం ఆనందంగా ఉంది’
– వసంత, వీఓఏ, పుంగనూరు మండలం, చిత్తూరు జిల్లా

గతంలో నష్టపోయాం..
‘ముఖ్యమంత్రి జగనన్న తీసుకుంటున్న నిర్ణయాలు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. టీడీపీ పాలనలో పొదుపు సంఘాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎలాంటి పథకాలు అందక నష్టపోయాం. ఇప్పుడు నవరత్నాల పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి మహిళకు లబ్ధి చేకూరుతుంది’
– క్రిష్ణవేణి, శ్రీరామ మహిళా సంఘం అధ్యక్షురాలు, పుట్లూరు గ్రామం, అనంతపురం జిల్లా

మాట నిలబెట్టుకోవడం ఎంతో సంతోషం..
‘వీవోఏలు రాత్రిపగలు కష్టపడినా గత ప్రభుత్వం గుర్తించలేదు. జీతం పెంచాలని ఎన్నోసార్లు అడిగినా పట్టించుకున్నవారే లేరు. ఎంతసేపూ సభలకు జనాన్ని తెమ్మనేవారు. ఎన్నికలకు ముందు పెంచుతున్నట్లు ప్రకటించినా సంఘం లాభాల్లో ఉంటేనే అంటూ మెలిక పెట్టడంతో పెంచిన మొత్తాన్ని మేం తీసుకోలేదు. పాదయాత్రలో జగనన్న నర్సీపట్నం వచ్చినప్పుడు మా కష్టాలు చెప్పుకున్నాం. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’
– కె.నాగలక్ష్మి, అమ్మపేట గ్రామం, గొలుగొండ మండలం, విశాఖ జిల్లా

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు