కూత పెట్టేనా?

12 Feb, 2014 00:02 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రకటించే రైల్వే బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహానగరంలో కీలక భాగమైన జిల్లాకు ప్రత్యేక రైళ్లు వస్తాయనే ఆశలు జిల్లావాసుల్లో చిగురిస్తున్నాయి. అదేవిధంగా సర్వే పనులు పూర్తయిన వికారాబాద్- కృష్ణా(121.7 కిలోమీటర్లు) బ్రాడ్‌గేజి రైలుమార్గం పనులు, ఎంఎంటీఎస్ విస్తరణ పనులకు మోక్షం వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లో పార్లమెంట్‌లో రైల్వేబడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. తాజా బడ్జెట్‌పై జిల్లా వాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే  పలు ప్రతిపాదనలు రైల్వే శాఖ వద్ద ఉండగా.. కొత్త డిమాండ్లు సైతం ప్రజాప్రతినిధులు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో ఏయే ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుందో వేచిచూడాలి.

 ప్రతిపాదనలివే..
     వికారాబాద్-కృష్ణా మధ్య కొత్తగా బ్రాడ్‌గేజ్ రైలుమార్గాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనలపై యంత్రాంగం సర్వే పూర్తిచేసింది. ఈ రైలు మార్గం నిర్మించాలంటే రూ.787.80 కోట్లు అవసరమని తేల్చిన రైల్వేశాఖ.. సరుకు రవాణాకు ఈ లైన్ అంతగా ఉపయోగపడదని స్పష్టం చేసింది. ప్రయాణికుల నిష్పత్తి కూడా అంతంతమాత్రంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చింది. ప్రాజెక్టు వ్యయంలో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు ముందుకొచ్చినప్పటికీ కేంద్రం స్పష్టత ఇవ్వలేదు.

     శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రైలు మార్గాన్ని అనుసంధానం చేయాలని గతంలో నిర్ణయించినా.. ఇప్పటికీ మోక్షం లేదు. ఎయిర్‌కార్గో హబ్‌గా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో సరుకు రవాణాకు అనువుగా రైల్వేలైన్లను విస్తరించాలని భావించినా.. రైల్వేశాఖ వద్ద ఫైళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా విజయవాడకు ప్రత్యేక రైల్వేలైన్‌ను నిర్మించాలని జీఎంఆర్ సంస్థ ప్రతిపాదించినా.. కేంద్రం నుంచి స్పందన లేదు.

 2006లో ప్రతిపాదించిన మల్టీమోడల్ ట్రాన్సిట్‌సిస్టమ్ (ఎంఎంటీఎస్) రెండోదశ విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీటికి ప్రత్యేక నిధులు కేటాయించాల్సి ఉంది.
 ఫల క్‌నుమా- ఉమ్దానగర్ వరకు ఉన్న రైలు మార్గాన్ని శంషాబాద్ వరకు విస్తరించాలని నిర్ణయించారు. ఫలక్‌నుమా- ఉమ్దానగర్ -శంషాబాద్ (20కి.మీ) వరకు కొత్త లైన్ వేయడమేగాకుండా, ప్రస్తుత మార్గాన్ని డబ్లింగ్, విద్యుద్ధీకరణ చేయాలని నిర్ణయించినప్పటికీ ఎలాంటి పురోగతి లేదు.
సికింద్రాబాద్- బొల్లారం -మేడ్చల్ (28కి.మీ), మౌలాలి -ఘట్‌కేసర్ (12.2 కి.మీ.)వరకు పొడగించాలని ప్రతిపాదించిన ఎంఎంటీఎస్‌కు ఇంకా ప్రతిబంధకాలు తొలగిపోలేదు.

 ఆదర్శ స్టేషన్ల నిర్మాణంలోనూ రైల్వేశాఖ అంతులేని జాప్యం చేస్తోంది. అరకొర నిధుల కేటాయింపులతో నిర్మాణ పనులను ఏళ్ల తరబడి సాగదీస్తోంది. 2011-12లో ప్రకటించిన పనులు కూడా ఇప్పటివరకు పూర్తికాలేదు. వికారాబాద్, శంకర్‌పల్లి, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి ఆదర్శ స్టేషన్లు అధికారుల నిర్లక్ష్యానికి అద్దంలా నిలుస్తున్నాయి. కొన్నింటికి ఇప్పటివరకు పునాది రాయే పడలేదు.

 వికారాబాద్, తాండూరును కలుపుతూ పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు వేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. తాజా బడ్జెట్‌లో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

మరిన్ని వార్తలు