చల్‌చల్‌ గుర్రం.. తండాకో అశ్వం

11 Nov, 2019 04:29 IST|Sakshi

విశాఖ గిరిజన తండాల్లో నేటికీ గుర్రాలే రవాణా సాధనాలు

తండా దాటి వెళ్లాలంటే అశ్వాలే దిక్కు

సంతలు, ఆరోగ్య కేంద్రాలకూ అవే వాహనాలు

పాఠాలు చెప్పే టీచర్లూ వాటిపై వెళ్లాల్సిందే

కొన్ని సినిమాల్లో హీరోల పాత్ర గొప్పగా పండాలంటే.. కచ్చితంగా గుర్రాల సీన్‌ ఉండాల్సిందే. పాత కాలంలో ఏమో గానీ.. ఆ మధ్యన మగధీరతో మొదలైన గుర్రపు స్వారీల హవా బాహుబలితో శిఖరాగ్రానికి చేరింది. అసలు విషయానికి వస్తే.. సినిమాల్లో హీరోయిజం ఎలివేట్‌ కావడానికి ఉపయోగపడే గుర్రాలు విశాఖ మన్యంలోని మారుమూల తండాల్లో దౌడు తీస్తున్నాయి. ఇక్కడి గిరిజనులకు రవాణా సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. నిజం చెప్పాలంటే ఇక్కడి గిరిజనుల జీవనంలో అశ్వాలు ఓ భాగమయ్యాయి.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కొండకోనల్లో విసిరేసినట్టుండే తండాల్లోని గిరి పుత్రులకు గుర్రాలే అసలైన నేస్తాలు. రోడ్లు లేని గ్రామాలు, అరణ్యాల నడుమ సుదూరంగా ఉండే గూడేల్ని చేరుకునేందుకు.. వర్షాకాలంలో గెడ్డలు, వాగులు దాటేందుకు గుర్రాలే సిసలైన వాహనాలు. కనీసం ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని చోటనుంచి అటవీ ఉత్పత్తుల్ని బాహ్య ప్రపంచానికి తరలించాలన్నా.. నిత్యావసర సరుకుల్ని తండాలకు తెచ్చుకోవాలన్నా ఈ ప్రాంత గిరిజనులు అశ్వాల్నే ఆశ్రయిస్తున్నారు. గూడేల్లోని గిరిపుత్రులు మండల కేంద్రాలకు.. అరకు, పాడేరు నియోజకవర్గ కేంద్రాలకు కాలి నడకన వెళ్లాలంటే కనీసం 12 నుంచి 25 కిలోమీటర్ల మేర కొండలు ఎక్కి, దిగాల్సి ఉంటుంది. 

తండాకు ఓ గుర్రం ఉంటే చాలు..
గిరిజనులు ఏడాది పొడవునా పండించే రాజ్‌మా చిక్కుళ్లు, రాగులు, జొన్నలు, కాఫీ, మిరియాలు, కొండ చీపుర్లు తదితర ఉత్పత్తులను వారపు సంతల్లో అమ్ముకునేందుకు.. సంతలో కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులు, ఇతర సామగ్రిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు విశాఖ మన్యంలోని గూడేల ప్రజలు గుర్రాలపైనే వస్తారు. అత్యవసర సమయాల్లో వైద్యసేవల కోసం మండల కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు గుర్రాలనే వినియోగిస్తుంటారు. మారుమూల తండాలు, ఆవాస ప్రాంతాల్లో 10 నుంచి 15 కుటుంబాల వరకు నివసిస్తుంటాయి. వారిలో ఏ ఒక్క కుటుంబానికి గుర్రమున్నా అందరూ వినియోగించుకుంటారు. అంతా కలిసి దాన్ని పోషిస్తారు. వీటికి గడ్డి, ధాన్యం, దాణా, ఉలవలు ఆహారంగా పెడతారు. వాటిని ప్రాణ సమానంగా చూసుకుంటారు. 

మాడుగుల సంతలో..
మాడుగుల మండల కేంద్రంలోని వడ్డాది ప్రాంతంలో ప్రతి దసరా రోజున గుర్రాల సంత జరుగుతుంటుంది. ఒక్కో అశ్వం ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. నర్సీపట్నం సమీపంలోని కేడీ పేటలోనూ గుర్రాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. 

అధికారిక విధులూ నిర్వర్తిస్తాయ్‌
- ఇక్కడి గుర్రాలను అడపాదడపా అధికారిక విధులకు సైతం వినియోగిస్తుంటారు
ఎన్నికల్లో బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ అధికారులను తరలించేందుకు గుర్రాలే కీలకం
అటవీ ప్రాంతంలో మావోలు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన సందర్భాల్లో మృతదేహాలను తరలించేందుకు సైతం గుర్రాలనే వాడుతుంటారు.

వినియోగం ఎక్కడెక్కడంటే..
జి.మాడుగుల మండలం కిల్లంకోట, లువ్వాసింగి
గెమ్మెలి పంచాయతీల పరిధిలోని తండాలు
చింతపల్లి మండలం బలపం పంచాయతీ
కోరుకొండ పంచాయతీ పరిధిలోని సుమారు 70 పల్లెలు
జీకే వీధి మండలం గాలికొండ, అమ్మవారి దారకొండ, జర్రెల, దుప్పిలవాడ, సప్పర్ల, ఎర్రచెరువుల
మొండిగెడ్డ, దారకొండ పంచాయతీల పరిధిలోని 150 తండాలు
పెదబయలు మండలం ఇంజరి పంచాయతీలోని 45 నివాస ప్రాంతాలు
గిన్నెలకోట పంచాయతీలోని 18 నివాస ప్రాంతాలు
జామిగుడ పంచాయతీలోని 19 తండాలు
ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు పంచాయతీలోని 18 పల్లెలు
బుంగాపుట్టు పంచాయతీలోని 24 నివాస ప్రాంతాలు
రంగబయలు పంచాయతీలోని 22 తండాలు

టీచర్‌కూ కొనిచ్చారు 
జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ పరిధిలోని సుర్లపాలెం ప్రాథమిక పాఠశాలలో చుట్టుపక్కల తండాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య 60 వరకు ఉంది. రోడ్డు మార్గం సరిగ్గా లేక.. ఉపాధ్యాయులు సక్రమంగా రాక విద్యార్థుల డ్రాప్‌ అవుట్స్‌ శాతం పెరిగింది. మూడు నెలల క్రితం ఇక్కడకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు గంపరాయి వెంకటరమణ ఇబ్బందులు పడుతూనే క్రమం తప్పకుండా స్కూలుకు వచ్చేవారు. దీంతో గిరిజనులంతా కలిసి ఆయనకు ఓ గుర్రాన్ని కొనిచ్చారు. ఆయన దానిపైనే వస్తూ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.

గుర్రం లేకుంటే మాకు జీవనం లేదు 
మేం పండించిన పంటలను అమ్ముకునేందుకు చింతపల్లి దరి లంబసింగిలో  ప్రతి గురువారం సంతకు వస్తుంటాం. గుర్రంపై బరువు వేసి.. మేం నడుచుకుంటూ వస్తాం. గుర్రం లేకుంటే మాకు జీవనమే లేదు.
    – గూడా బాబూరావు, చీడిమెట్ట గ్రామం, కిల్లంకోట పంచాయతీ, జి.మాడుగుల మండలం  

మా పిల్లలకు అవే నేస్తాలు
మా గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే గుర్రాలే దిక్కు. అందుకే వాటిని మేం ప్రాణంగా చూసుకుంటాం. మా పిల్లలకు అవే నేస్తాలు.. మా గుర్రాన్ని మా పిల్లలు రాజు అని పిలవగానే పరుగెత్తుకు వస్తుంది.
– ఎండ్రపల్లి సూరిబాబు, సుర్తిపల్లి, కిల్లంకోట పంచాయతీ, జి.మాడుగుల మండలం 

మరిన్ని వార్తలు