పొంగి కృశిం‘చేను’ 

14 Aug, 2019 11:30 IST|Sakshi
పోడూరు మండలంలో దెబ్బతిన్న నారుమడి

గోదావరి వరదలకు జిల్లాలో వరి పంటతోపాటు ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. లంక గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాల్లో వేసిన ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా అధికార యంత్రాంగం నష్టం అంచనాలో నిమగ్నమైంది. ముంపు మండలాల్లో ప్రభుత్వం సేకరించిన భూముల్లో కూడా ఈ ఏడాది పంటలు వేశారు. అవి కూడా దెబ్బతిన్నాయి. వీటికి కూడా ఉచితంగా విత్తనాలు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

సాక్షి, పశ్చిమగోదావరి : గత నెల 31 నుంచి గోదావరికి వరద సంభవించింది. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది.  గంట గంటకూ వరద హెచ్చుతగ్గులతో రైతులు ఆందోళన చెందారు. అదృష్టవశాత్తూ వరద తగ్గుముఖం పట్టినా పంటలను భారీగా ముంచింది. జిల్లా వ్యాప్తంగా గోదావరి తీర ప్రాంత రైతులు పంటలు సాగు చేసుకునేందుకు సమాయత్తమయ్యారు. ఎగువన ఉన్న కుక్కునూరు మండలం నుంచి వేలేరుపాడు, పోలవరం, తాళ్లపూడి, కొవ్వూరు, పెరవలి, ఆచంట, యలమంచిలి మండలాల వరకూ గోదావరి పరీవాహక ప్రాంతంలో వరి, కూరగాయలు, పత్తి, అరటి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే ప్రకృతి గోదావరి వరద రూపంలో కన్నెర్ర చేసింది. నదీపరీవాహక ప్రాంతంలో రైతులను నష్టలపాలు చేసింది. మరో అడుగుమేర వరద పెరిగినా మరింత భారీస్థాయిలో పంటలు నష్టపోవాల్సి వచ్చేదని అధికారులు చెబుతున్నారు. 

అధికారులు అప్రమత్తం  
వరద ప్రారంభం నుంచే జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.  కలెక్టర్‌ ముత్యాలరాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ గౌసియాబేగం వరద ప్రాంతాల్లో పర్యటించారు. పంటల వివరాలను ప్రాథమికంగా అంచనా వేసేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్బారావు ఆధ్వర్యంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ దుర్గేష్‌ ఉద్యానవన పంటల నష్టాల అంచనాకు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రోజూ పంటలు ఏ మేర నష్టపోవాల్సి వస్తుందో అంచనాకు వచ్చారు. 

ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీరు  
ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరద నీరు పంట చేల నుంచి బయటకు వెళ్లకపోవడంతో నష్టం అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఉద్యాన, వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నరసాపురం రెవెన్యూ డివిజన్‌లోని మండలాల్లో ఇంకా  ముంపు బారినే పంటలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 

పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల రైతులకు కష్టం
పోలవరం ప్రాజెక్టు నిమిత్తం కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో రైతుల వద్ద నుంచి భూసేకరణ చేపట్టారు. అయితే వారిని ఇంకా అక్కడి నుంచి తరలించలేదు. దీంతో ప్రభుత్వం సేకరించిన భూముల్లో రైతులు పంటలు సాగు చేశారు. ఈ నేపథ్యంలో వరద వల్ల అక్కడి రైతులు పంటలను నష్టపోయారు. ఈ ప్రాంతాల్లోనూ అధికారులు నష్టాలను నమోదు చేశారు. వీరికి నిబంధనల ప్రకారం.. ఎటువంటి సాయం అందదు. అయితే ఇటీవల ఏరియల్‌ రివ్యూ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి కలెక్టర్‌ ముత్యాలరాజు ఈ అంశాన్ని తీసుకువెళ్లారు. దీంతో వారికి కూడా ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  నష్టపోయిన రైతులకు వెంటనే విత్తనాలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

పంట నష్టాలు ఇలా...
జిల్లాలో అరటి 190 హెక్టార్లు, కూరగాయలు 62 హెక్టార్లలో,  బొప్పాయి 8 హెక్టార్లలో నష్టపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 105.8 హెక్టార్లలో 1,587 మంది రైతులు వరినారుమళ్లు నష్టపోగా  183.8 హెక్టార్లలో వరి సాగుకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. కుక్కునూరు మండలంలో పత్తి 800 హెక్టార్లలో, వేలేరుపాడు మండలంలో 20 హెక్టార్లలో వరి నారుమళ్లు, 100 హెక్టార్లలో వరిసాగు,  పోలవరం మండలంలో 182 హెక్టార్లు వరి నారుమళ్లకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు అంచనాలు సిద్ధం చేశారు.  అయితే ఈ నష్టం రెండింతలు ఉండవచ్చని సమాచారం. నీరు పూర్తిగా తగ్గిన తర్వాతే అసలు నష్టం ఎంత అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు