ఫలసాయం పుష్కలం

21 Oct, 2019 04:57 IST|Sakshi

రాయలసీమలో పెరుగుతున్న ఉద్యాన పంటల విస్తీర్ణం

ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు మెండు

వాటి ఏర్పాటుతో కరువు సీమ రైతుకు మేలు

మార్కెట్‌ సౌకర్యాలు లేక నష్టపోతున్న రైతన్నలు

కర్నూలు అగ్రికల్చర్‌: కరువు సీమలో పండ్ల తోటల పెంపకం గణనీయంగా పెరిగింది. ఉత్పత్తులూ అంచనాలను మించుతున్నాయి. అయితే రాయలసీమలో ఉద్యాన పంటల ఆధారిత పరిశ్రమలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, మార్కెటింగ్‌ సౌకర్యాలు మృగ్యం. ఇవి అందుబాటులోకి వస్తే రైతన్నలకు కనక వర్షమే. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్న మామిడి పల్ప్‌ ఫ్యాక్టరీ ఒక్కటీ ఎప్పుడో మూతడింది. సీమలో సంప్రదాయ పంటల సాగు తగ్గి రైతులు ఉద్యాన పంటల వైపు దృష్టి సారించడం మంచి మార్పునకు సంకేతమని సంబంధిత అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు లక్షల హెక్టార్లలో పండ్ల తోటలు 
సీమ జిల్లాల్లో 4,02,567 హెక్టార్లలో మామిడి, చీని, సపోట, దానిమ్మ, అరటి, నిమ్మ, బొప్పాయి, ద్రాక్ష, పనస, ఉసిరి తదితర పండ్ల తోటలు సాగుచేస్తున్నారు. ఏటా 99,79,122 టన్నుల దిగుబడి లభిస్తోంది. ఈ ఏడాది అదనంగా 15వేల హెక్టార్లలో తోటలు పెంచుతున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అరుదుగా పండే ఆపిల్‌బేర్, కర్జూరాలు, డ్రాగన్‌ ఫ్రూట్స్‌ కూడా సాగు చేస్తున్నారు.

వివిధ ప్రాంతాలకు ఎగుమతులు 
ఈ ప్రాంతం నుంచి అరటి, బొప్పాయి, సపోటా ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు చీని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు దానిమ్మ, నిమ్మ వెళుతోంది. మామిడి దేశం నలుమూలలకు పంపుతున్నారు. అరటి, దానిమ్మ, బొప్పాయి, మామిడి గల్ఫ్‌ దేశాలకు కూడా ఎగుమతి అవుతుండడం విశేషం. ఏటా రూ. 20 వేల కోట్ల విలువైన పండ్లను ఉత్పత్తి చేస్తుండగా, దానిలో రూ. 5 వేల కోట్ల ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

మార్కెటింగ్‌ సౌకర్యం లేక నష్టపోతున్న వైనం 
సీమ జిల్లాల్లో పండ్ల ఆధారిత పరిశ్రమలు, మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంతో రైతులు బాగా నష్టపోతున్నారు. పెట్టుబడి, కష్టం రైతులది కాగా... లాభాలు మాత్రం దళారులు ఎగరేసుకు పోతున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి దాదాపు 2,000 టన్నుల పండ్లు హైదరాబాద్‌కే  తరలిస్తున్నారు. మామిడి సీజన్‌లో రోజువారీ ఎగుమతి విలువ రూ.5 కోట్లు పైమాటే. దీనిపై ఒక శాతం మార్కెట్‌ సెస్‌...రూ.50 లక్షల దాకా తెలంగాణ ప్రభుత్వానికి వెళుతోంది. అదే సీమ జిల్లాల్లో ఫ్రూట్‌ మార్కెట్‌ ఉంటే ఆ ఆదాయం ఏపీ ప్రభుత్వానికి లభించేది.  అలాగే పండ్ల తోటల రైతులకు లాభదాయకంగా ఉంటుంది.

ఉద్యాన తోటల అభివృద్ధికి కృషి
కర్నూలు జిల్లాలో ఉద్యాన తోటల అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నాం. మార్కెంటింగ్‌ సదుపాయాలు పెంచేలా ప్రయత్నాలు మొదలు పెట్టాం. అలాగే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను రైతుల్లోకి తీసుకెళ్లి ఉద్యాన తోటలు విరివిగా సాగుచేసేలా చూస్తున్నాం. ఉద్యాన ఆధారిత పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి హార్టికల్చర్‌ మిషన్‌ కింద సబ్సిడీలు అందజేస్తాం. 
సీహెచ్‌ పుల్లారెడ్డి, జాయింట్‌ డైరెక్టర్, ఉద్యాన శాఖ, కర్నూలు

ప్రధాన పండ్లతోటల సాగు (హెక్టార్లలో)
మామిడి=2,14,060,అరటి=60,065 ,నిమ్మ=3,070 ,బొప్పాయి=13,273 ,సపోట=5,173,కరబూజ=10,267 ,చీని=68,818 ,కళింగర=1,02,231 ,ఉసిరి=362,జామ=2,849,సీతాఫలం=9,643,
రేగు=1,210

డ్రాగన్‌ ఫ్రూట్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఒక్కసారి ఈ మొక్కలు నాటితే 20 ఏళ్లకు పైగా దిగుబడులు ఇస్తాయి. అరుదైన ఉద్యాన పంటలు పండిస్తున్నా, వాటి ఆధారిత పరిశ్రమలు లేకపోవడంతో నష్టపోతున్నాం. ఈ పంటను సీమలోని జిల్లాల్లో పండిస్తున్నందున వీటి ఆధారిత పరిశ్రమలతో పాటు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. 
– విష్ణువర్ధన్‌రెడ్డి, కరివేముల,దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా