ఆసుపత్రి కమిటీల్లో రాజకీయ నేతలకు చెక్

8 Jul, 2015 01:21 IST|Sakshi

 తణుకు : ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీల్లో రాజకీయ నాయకులకు చెక్ పడింది. ఇంతకాలం కమిటీల్లో చైర్మన్ పదవి నుంచి సభ్యుల వరకు పదవులు చేపట్టి చేసిన రాజకీయాలు ఇక చెల్లకుండా కమిటీలను పునర్నియామకం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులకు సంబంధించి కమిటీల్లో మార్పులు చేయాలని సూచించింది. ఇప్పటివరకు చైర్మన్ హోదాలో ఆసుపత్రి స్థాయిని బట్టి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తుండగా ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి వారి స్థానంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించనున్నారు.
 
 ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నాయకులు
 జిల్లాలో 8 ఏరియా ఆసుపత్రులు, 10 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 73 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతో పాటు ఏలూరులోని జిల్లా కేంద్ర ఆసుపత్రి ఉన్నాయి. జిల్లా ఆసుపత్రి సలహా కమిటీ చైర్మన్‌గా జిల్లా పరిషత్ చైర్మన్, ఏరియా ఆసుత్రులకు ఎమ్మెల్యేలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు జెడ్పీటీసీ సభ్యులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు మండల పరిషత్ అధ్యక్షులు చైర్మన్లుగా కొనసాగుతుండగా సభ్యులు, ఇతరత్రా పదవుల్లో రాజకీయ నాయకులతో పాటు స్థాయిని బట్టి ఆసుపత్రి వైద్యులు కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం కమిటీల్లో రాజకీయ నేతలను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంతో కొందరు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులపై మండిపడుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వాదనకు దిగుతున్నట్టు తెలుస్తోంది.
 
 జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు జిల్లాలోని అన్ని ప్రాథమిక, సామాజిక ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులకు ప్రస్తుతం చైర్మన్ హోదాలో కలెక్టర్ నియమించిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిని నియమించాల్సి ఉంది. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు కన్వీనర్‌లుగా సీనియర్ మెడికల్ ఆఫీసర్, డెప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో వ్యవహరిస్తారు. ఏరియా ఆసుపత్రులకు కో చైర్‌పర్సన్‌గా ఆర్డీవో లేదా సబ్‌కలెక్టర్, కన్వీనర్‌గా ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రులకు కో చైర్‌పర్సన్‌గా జిల్లా కలెక్టర్, కన్వీనర్‌గా మెడికల్ సూపరింటెండెంట్ వ్యవహరించనున్నారు. వీరంతా నెలకోసారి సమావేశమై ఆసుపత్రి అభివృద్ధికి అవసరమయ్యే సూచనలు, సలహాలు సమీకరించడంతోపాటు స్వచ్ఛంద సంస్థల నుంచి నిధులు సేకరించి తద్వారా ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంటుంది.
 

మరిన్ని వార్తలు