వీలుంటే చైర్ ఇవ్వండి

22 Apr, 2016 03:31 IST|Sakshi
వీలుంటే చైర్ ఇవ్వండి

‘ అనంత’ ఆస్పత్రిలో వీల్‌చైర్ల కరువు
15 కుర్చీలతోనే నెట్టుకొస్తున్న అధికారులు
తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు

 
 
 అనంతపురం మెడికల్ :  ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ‘వీల్‌చైర్’ కష్టాలు అన్నీఇన్నీ కావు. రోజూ 800 మందికి పైగా ఇన్‌పేషెంట్స్.. వెయ్యి మందికి పైగా ఔట్‌పేషెంట్స్ వచ్చే ఈ ఆస్పత్రిలో వీల్‌చైర్ దొరకాలంటే గగనమవుతోంది. ప్రభుత్వాస్పత్రిలో కేవలం 15 వీల్ చైర్లే ఉన్నాయి. వీటిలో కూడా అత్యధికం ఆయా వార్డులకు కేటాయించారు. దీంతో రోగుల బంధువులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గురువారం ధర్మవరం నుంచి మైలసముద్రానికి వెళ్తుండగా వెల్దుర్తి వద్ద ఆటోలోంచి కిందపడిపోవడంతో మైలసముద్రానికి చెందిన అక్కమ్మ (58) గాయపడింది. దీంతో ఆమెను అనంతపురం ఆస్పత్రికి తీసుకొచ్చారు.

చికిత్స చేసిన వైద్యులు స్కానింగ్ చేయించారు. ఈ రిపోర్టులు గురువారం వస్తాయని చెప్పారు. దీంతో అప్పటికే నడవలేని స్థితిలో ఉన్న ఆమెను వీల్‌చైర్‌లో అలాగే ఉంచారు. అంతలో ఆమెకు ఆకలేస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆహారాన్ని తెచ్చివ్వడంతో వీల్‌చైర్‌లోనే కూర్చుని తింటోంది. అదే సమయంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యురాలిని ఆస్పత్రికి తెచ్చారు. వారి పరిస్థితి కూడా నడవడానికి వీల్లేకుండా ఉండడంతో అక్కమ్మ వద్దకు వచ్చి వీల్‌చైర్ కోసం వేచిచూశాడు.

అప్పటికే ఓపీ సమయం ముగుస్తుండడంతో కోపగించుకున్నాడు. అంతలో అక్కమ్మ కుటుంబ సభ్యులు ఆమెను వీల్‌చైర్‌లోంచి లేపి ఆరుబయట కూర్చోబెట్టడంతో ఆమె భోంచేసి వెళ్లిపోయింది. ఇలా ప్రతి రోజు రోగులు ఇలాంటి ఇబ్బందులే పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎక్కువ సంఖ్యలో వీల్‌చైర్లు అందుబాటులో ఉంచితే రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు