మృత శిశువు డిశ్చార్జ్‌కు రూ.5 వేలు డిమాండ్‌

23 Feb, 2019 13:25 IST|Sakshi
ప్యాపిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

 రూ.3 వేలు ముట్టజెప్పిన బాధితుడు

ప్యాపిలి ప్రభుత్వాస్పత్రిలో ఘటన  

కర్నూలు  ,ప్యాపిలి: స్థానిక ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది కొందరు మానవత్వం మరచిపోతున్నారు. సాటి మనుషులను డబ్బులకు పీక్కు తింటున్నారు. మృత శిశువును డిశ్చార్జి చేసేందుకు కూడా రూ.5 వేలు డిమాండ్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండల పరిధిలోని ఎర్రగుంట్లపల్లి గ్రామానికి చెందిన గొల్ల రాము భార్య గొల్ల అరుణ రెండు రోజుల క్రితం రాత్రి 11 గంటల ప్రాంతంలో పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్‌ నర్సులు అరుణ, రాజ్యలక్ష్మి.. గర్భిణిని పరీక్షించారు.

కడుపులోనే శిశువు మృతిచెందిన విషయం గుర్తించి ప్రసవం చేశారు. భగవంతుడు తమ పట్ల చిన్నచూపు చూశాడని మృత శిశువును చేతుల్లో పెట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ‘ఇక ఏడ్చింది చాలు.. రూ. 5 వేలు ఇచ్చి బయటకు వెళ్లండి’ అని సిబ్బంది కరాఖండిగా చెప్పారు. చికెన్‌ సెంటర్లో పని చేసుకునే తన వద్ద అంతడబ్బు లేదని రాము వైద్య సిబ్బందితో తన పరిస్థితి చెప్పుకున్నా అక్కడి సిబ్బంది ఏమాత్రం కనికరించకపోగా, డబ్బు ఇవ్వందే డిశ్చార్జ్‌ చేసేదిలేదన్నారు. దీంతో రాము అప్పటికప్పుడు చికెన్‌ సెంటర్‌ వద్దకు వెళ్లి రూ.3 వేలు తెచ్చి వారి చేతులు తడిపి, మృత శిశువుతో ఇంటికి వచ్చాడు. ఈ విషయమై వైద్యాధికారి చెన్నకేశవులును వివరణ కోరగా జరిగిన ఘటనపై తన దృష్టికి కూడా వచ్చిందని, విచారించి చర్యలు తీసుకుంటానని తెలిపారు.   

మరిన్ని వార్తలు