పోస్టుమార్టం చేయకుండానే పంపించేశారు 

15 Nov, 2019 08:13 IST|Sakshi

సాక్షి, కర్నూలు : మెడికో లీగల్‌ కేసు నమోదై చనిపోయిన ఓ మహిళ మృతదేహానికి ఆసుపత్రి సిబ్బంది పోస్టుమార్టం చేయకుండా ఇంటికి పంపించేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె ఇంటికెళ్లి మృతదేహాన్ని మార్చురీకి తీసుకొచ్చిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానిక గణేష్‌ నగర్‌కు చెందిన వెంకటమ్మ  ప్రమాదవశాత్తు కింద పడి వారం క్రితం ఆసుపత్రిలోని న్యూరో సర్జరీ విభాగంలో చేరింది.

తలకు గాయం కావడంతో వైద్యులు మెడికో లీగల్‌ కేసు (ఎంఎల్‌సీ)గా నమోదు చేశారు. అయితే ఆమె చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. న్యూరోసర్జరీ విభాగం సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమారా్టనికి పంపంకుండా ఇంటికి పంపించేశారు. విషయం ఆ నోటా ఈ నోటా బయటికి పొక్కడంతో న్యూరో సర్జరీ సిబ్బంది ఆందోళన చెందారు. ఆసుపత్రి స్వీపర్‌ను మృతురాలి ఇంటికి పంపించారు. అయితే ఎంఎల్‌సీ విషయం తెలియకుండా వార్డు సిబ్బంది ఎలా మృతదేహాన్ని ఇంటికి పంపిస్తారని తిట్టి పంపించారు. విషయం తెలుసుకున్న ఆసుపత్రి అవుట్‌ పోస్టు పోలీసులు మృతురాలి ఇంటికెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.   

మరిన్ని వార్తలు