సుస్తీమే సవాల్

23 Aug, 2014 01:47 IST|Sakshi

ఏలూరు (సెంట్రల్) : ప్రజలు రోగాల బారిన పడటం మామూలే. కానీ.. ఆస్పత్రులే అనారోగ్యం పాలైతే..? జిల్లాలోని ఎంప్లాయూస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్‌ఐ) డిస్పెన్సరీల పరిస్థితి అలాగే ఉంది. కార్మికుల ఆరోగ్యం కాపాడేందుకు ఏర్పాటు చేసిన కార్మికరాజ్య బీమా ఆస్పత్రులు (డిస్పెన్సరీలు) జబ్బుబారిన పడ్డాయి. రుగ్మతలతో ఏళ్ల తరబడి ఈసురోమని నడుస్తున్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు రాష్ట్ర విభజన తర్వాత మరిన్ని కొత్త జబ్బులతో క్షీణదశకు చేరుకుంటున్నాయి. చివరకు కార్మికులకు రోత పుట్టించే దుస్థితికి దిగజారాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గల ఏ డిస్పెన్సరీ ఇందుకు మినహాయింపు కాదు.
 
ఏమీ లేవు
జిల్లాలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీలలో మందులు లేవు. వైద్యులు లేరు. వైద్య పరికరాలు సైతం లేవు. కనీస వసతులు లేవు. కానీ.. ప్రతి డిస్పెన్సరీ పరిధిలో రోగులు మాత్రం దండిగా ఉన్నారు. తలనొప్పి, దగ్గు, జ్వరం వంటి సాధారణ రుగ్మతలను తగ్గించే మందులు తప్ప ముఖ్యమైన మందులు అన్ని డిస్పెన్సరీల్లోనూ నిండుకున్నారుు. స్పెషల్ డ్రగ్స్‌గా పిలిచే ప్రత్యేక మందులైతే ఎక్కడా అందుబాటులో లేవు. మధుమేహం బాధితులకు ఇచ్చే ఇన్సులిన్, టాబ్లెట్స్, బీపీ మాత్రలు, ఉబ్బసం రోగులకు ఇచ్చే ఇన్‌హేలర్స్ వంటి ప్రత్యేక మందుల కొరతతో కార్మికులు పడుతున్న వెతలు వర్ణనాతీతంగా ఉన్నారుు.
 
‘సారీ.. గుణదల వెళ్లండి’
రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు రోగాల బారిన పడితే అంతే సంగతులు. వారికి ఆ రోగం వల్ల వచ్చే బాధకన్నా వివిధ పత్రాలు, సంతకాలు, మందుల కోసం ఈఎస్‌ఐ డిస్పెన్సరీల చుట్టూ తిరిగే బాధే ఎక్కువగా ఉంటోంది. స్పెషల్ మెడిసిన్స్ అందుబాటులో లేని కారణంగా ఈఎస్‌ఐ ఆస్పత్రులకు వచ్చే రోగులను తొలుత గుణదల ఆస్పత్రికి పంపుతున్నారు. అక్కడి నుంచి జబ్బును బట్టి స్పెషలిస్టులు ఉన్న ఆస్పత్రులకు పంపుతున్నారు. అక్కడ వైద్యం చేయించుకున్న తర్వాత క్రమం తప్పకుండా వాడాల్సిన ఇన్సులిన్, టాబ్లెట్లు వగైరా మందులన్నీ అక్కడి నుంచే తెచ్చుకోమని చెబుతున్నారు.
 
దీనివల్ల కార్మికులు తరచూ అక్కడకు వెళ్లి రావడానికి భారీగా ఖర్చవుతోంది. సమయం వృథా కావడంతోపాటు సకాలంలో వైద్యం అందడం లేదు. ఏ మందులూ లేనప్పుడు తాము మాత్రం డిస్పెన్సరీల్లో కూర్చోవడం ఎందుకనుకుంటున్నారో ఏమో కానీ... ఎక్కడ చూసినా వైద్యుల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వైద్యుల కోసం చూసీచూసీ కొత్త జబ్బులొచ్చేలా ఉన్నాయని రోగులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు