ఆ వార్డెన్‌ మాకొద్దు

4 Dec, 2018 07:01 IST|Sakshi
రోడ్డుపై భైఠాయించి నిరసన తెలుపుతున్న కురుకూటి ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు,(ఇన్‌సెట్‌లో) గేటు వేసి డీడీని అడ్డుకున్న విద్యార్థినులు

రోడ్డుపై భైఠాయించిన నిరసన తెలిపిన కురుకూటి ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు

సాలూరు రూరల్‌,విజయనగరం: వార్డెన్‌ తమకు సక్రమంగా భోజనం పెట్టలేదని, పలు ఇబ్బందులు పెడుతున్నారని తక్షణమే ఆమెను తొలగించాలని మండలంలోని కురుకూటి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల వి ద్యార్థినులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం వారు పాఠశాల ఎదురుగా ఉన్న రహదారిపై భైఠాయించి నిరసన తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వార్డెన్‌ సుశీల సక్రమంగా భోజనం పెట్డడంలేదని ఆమెను తొలగించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో కలసి విద్యార్థినులు ధర్నా చేశారు.

ఆదివారం వంట చేయలేదు
గ్యాస్‌ లేదన్న కారణంతో ఆదివారం మధ్యాçహ్నం భోజనం వండలేదని, రాత్రి గ్యాస్‌ తీసుకువస్తే 10 గంటల సమయంలో భోజనం అందించారు. ఆ సమయంలో 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థినులు భోజనం చేయకుండా నిరసన తెలిపి ఆకలితోనే ఉండిపోయారు. సోమవారం ఉదయం కూడా అల్పాహారం చేయకుండా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో కలిసి వార్డెన్‌ను  తొలగించాలంటూ ధర్నా నిర్వహించారు.

డీడీని అడ్డుకున్న విద్యార్థినులు
విద్యార్థినులు ధర్నా చేస్తున్న సమాచారం అందుకున్న ఐటీడీఏ డీడీ కిరణ్‌కుమార్, ఏటీడబ్ల్యూ వరలక్ష్మితో కలిసి  మధ్యాహ్నం పాఠశాలకు చేరుకున్నారు. సమయంలో  పాఠశాల గేటు వేసి డీడీని అడ్డుకుని తమ నిరసన తెలియజేశారు. పలు పరిణామాల అనంతరం విద్యార్థినులు  గేటు తెరవగా డీడీ విచారణ చేపట్టారు. విద్యార్థినులతో  మాట్లాడారు. వార్డెన్‌ సుశీల సక్రమంగా భోజనం పెట్టడం లేదని, ఆదివారం భోజనం వండకపోవడంతో ఆకలితో పడుకున్నామని 8, 9, 10 తరగతులు విద్యార్థినులు తెలిపారు. తమకు ఆ వార్డెన్‌ వద్దని, ఆమెను తొలగించాలని పట్టుబట్టారు. గ్యాస్‌ అయిపోవడం వల్ల భోజనం పెట్టలేకపోయామని వార్డెన్‌ సుశీల డీడీకి వివరించారు.

వార్డెన్‌ను సస్పెండ్‌ చేశాం
డీడీ కిరణ్‌కుమార్‌ విలేకర్లతో మాట్లాడుతూ వార్డెన్‌ను సస్పెండ్‌ చేశామని తెలిపారు. వార్డెన్‌ బాధ్యతలను  హెచ్‌ఎమ్‌కు ఇచ్చినట్లు తెలిపారు. విచారణ అంశాల  నివేదికను ఉన్నతాధికారులకు ఇవ్వనున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు